Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల టైంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్‌... అమలు చేయడం లేదని ప్రజల్లోకి వెళ్తోంది. అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆరోపిస్తోంది. వేదిక ఏదైనా బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు మాత్రం హామీలపైనే ఉంటున్నాయి. 


 వంద రోజుల్లోనే కీలకమైన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కొన్నింటిని కూడా అమలు చేయలేకపోయిందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. ఇదే అజెండాతో ఎన్నికల్లోకి వెళ్లాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పంటలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 


పార్లమెంట్ ఎన్నికలను రిఫరెండమ్‌గా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు... అన్ని హామీలు నెరవేర్చాకే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని సూచిస్తున్నార బీఆర్‌ఎస్‌ నేతలు. ఆ డిమాండ్‌ సీఎం రేవంత్ వరకు చేరేలా పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టబోతున్నట్టు తెలిపారు. 


తప్పుడు హామీలతో అన్ని వర్గాలను మోసం చేయడమే కాకుండా ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పక్క పార్టీ నేతలను చేర్చుకోవడంపైనే దృష్టి పెట్టారని విమర్శిస్తున్నారు హరీష్‌రావు.