రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. నవంబరు 25న పోలింగ్, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థిని మట్టికరిపించి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పని చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వసుంధరా రాజేకు ప్రత్యామ్నాయంగా దియా కుమారిని చూపించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న వసుంధరా రాజేకు రెండో జాబితాలో చోటు కల్పించింది. ఆమె మద్దతుదారుల్లో కొందరికి సీటు కేటాయించింది. వసుంధర రాజేను పక్కన పెట్టడం ద్వారా ఏర్పడిన ఖాళీని భర్తీ చేసుకునేందుకే, రాజవంశానికి చెందిన దియా కుమారిని అందలమెక్కిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వ్యూహం మార్చిన కమలం పార్టీ
రాజ్‌సమంద్ లోక్‌సభ స్థానం గెలుపొందిన దియా కుమారిని కమలం పార్టీ అధిష్ఠానం అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. దియాకుమారిని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడం వెనుక బీజేపీ పెద్ద వ్యూహామే రచించింది. ప్రతిష్ఠాత్మక విద్యాధర్ నగర్ స్థానం నుంచి పోటీకి నిలిపింది. 2018 ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలకు తొలి విడతగా అభ్యర్థులను ప్రకటించింది. 40 చోట్ల పరాజయం పాలైంది. రాజసమంద్ అసెంబ్లీలో మాత్రమే ఘన విజయం సాధించింది. ఆ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన నర్పత్ సింగ్ రజ్వీ 30 వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్‌కు రజ్వీ స్వయానా అల్లుడు. ప్రస్తుతం వసుంధరా రాజే వర్గంలో ఆయన కీలకనేతగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వ్యక్తిని కాదని, బీజేపీకి కంచుకోటగా ఉన్న ఆ స్థానాన్ని దియా కుమారికి కేటాయించడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అనుభవం లేకపోయినా..!
వసుంధరా రాజే, దియా కుమారి ఇద్దరూ ప్రముఖ రాజకుటుంబాల నుంచి వచ్చిన వారే. అయితే రాజేకు ఉన్న రాజకీయ అనుభవం దియా కుమారికి లేదు. దియాకుమారి ఇప్పటి వరకు కేవలం రెండు ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె, వ్యక్తిగత కారణాలతో 2018 అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాజసమంద్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా విజయం సాధించారు. తాజాగా మళ్లీ విద్యాధర్ నగర్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అపార అనుభవం ఉన్న రాజేను పక్కన పెట్టి, పెద్దగా రాజకీయ అనుభవం లేని దియాకు ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.
వసుంధర వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత
బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై వసుంధరా రాజే వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భైరాన్ సింగ్ షెకావత్ వారసత్వాన్ని కమలం పార్టీ అగ్రనేతలు చులకనగా చూస్తున్నారంటూ రజ్వీ విమర్శలు ఎక్కుపెట్టారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసిన షెకావత్‌ను అవమానిస్తున్నారంటూ నర్పత్ సింగ్ రజ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మొహం పెట్టుకొని షెకావత్ శతవసంతాల వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని రజ్వీ ఘాటు వ్యాఖ్యలు సంధిస్తున్నారు. ఏ అర్హతతో ఆ స్థానాన్ని దియా కుమారికి ఆ స్థానాన్ని కట్టబెట్టారని ప్రశ్నలు సంధించారు. అధిష్ఠానంతో విభేదాల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా వసుంధర రాజేను బీజేపీ పక్కన పెట్టింది. ఆమెకు ప్రత్యామ్నాయంగా ప్రముఖ రాజ కుటుంబానికి చెందిన దియా కుమారిని తెరమీదకు తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా దియాకుమారిని అసెంబ్లీ బరిలోకి దింపడంతో, వసుంధర రాజే వర్గం అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది.