Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రాజకీయ పార్టీల భవిష్యత్‌నేకాదు చాలా మంది సామాన్యుల తలరాత కూడా మార్చేయనున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, హోరాహోరీ పోరాటంలో కొందరు అతి సామాన్యులు కూడా టికెట్ దక్కించుకొని బరిలో నిల్చున్నారు. రాజకీయం అంటే చేతి నిండా డబ్బులు, పేరు వెనకాల రాతలు ఉండాల్సిన అవసరం లేదని పార్టీకి సిన్సియర్‌గా కష్టపడితే చాలు అంటు చాటి చెబుతున్నారు. 


ఉపాధి కూలీకి టికెట్


అలాంటి వారిలో ఈరలక్కప్ప. ఇప్పుడు ఈయన వైసీపీ తరఫున అసెంబ్లీ టికెట్ దక్కించుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ స్థానం. జగన్ మోహన్ రెడ్డిపై అభిమానంతో  వైసిపిలో ఒక కార్యకర్తగా వీరలకప్ప ప్రస్థానం ప్రారంభమైంది. గుడిబండ మండలం పలారం గ్రామానికి చెందిన ఈరలక్కప్పప్రైవేట్ టీచర్‌. వైఎస్ హయాంలో ఇందిరమ్మ గృహం మంజూరైంది. ఈయన ఫ్యామిలీ ఉపాధి కూలీకి వెళ్తే డబ్బులు వచ్చేవి. మిగతా టైంలో చింతపండు అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో యాక్టివ్‌గా పని చేసేవాళ్లు. 


ఊహించలేదు; లక్కప్ప


వైసీపీ అధికారంలోకి  వచ్చాక గ్రామ సర్పంచ్‌ అయ్యారు.  తన పని తీరుతో అధినాయకత్వం దృష్టి ఆకర్షించారు. మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే మార్పు ఆయనకు వరంగా మారింది. స్థానిక నాయకుల ప్రోత్బలంతో వీర  లక్కప్ప ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. ఏబీపీ దేశంతో మాట్లాడిన వీరలక్కప్ప... " నాకు సర్పంచ్‌ పదవి రావడమే ఆశ్ఛర్యంగా ఉంది. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఎప్పుడూ ఊహించని విషయం. వైఎస్‌, జగన్‌ను నమ్ముకున్నందుకు దక్కిన ప్రతిఫలం. సామాన్యుడిని కచ్చితంగా ప్రజలు గెలిపించుకుంటారు"


శిరీషదే అదే కథ 


ఈ కోవలోకి వచ్చే మరో నేత రంపచోడవరం అభ్యర్థి. టీడీపీ తరఫున టికెట్ దక్కించుకున్నాకు మిరియాల శిరీషా దేవి. ఈమె ఓ సాధారణ గృహిణి. అంగన్‌వాడి కార్యకర్త. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో కచ్చితంగా గెలవాలన్న ఉద్దేశంతో టీడీపీ సామాన్య మహిళకు టికెట్ ఇచ్చింది. ఆమె నేపథ్యం కూడా వీర లక్కప్పకు ఏమాత్రం తీసిపోనట్టే ఉంటుంది. 


అంగన్వాడి కార్యకర్తగా...


రాజవొమ్మంగి మండలం అనంతగిరిలో శిరీష్ అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేశారు. ఎనిమిదేళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగారు. ఆమె భర్త విజయభాస్కర్‌ టీడీపీలో సామాన్య కార్యకర్త. ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటంతో ఆమెకు సమస్యలు ఎదురయ్యాయి. ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వ డబ్బులు తీసుకొని విమర్శిస్తున్నారని విమర్శలు చేశారు. 


భర్తతో కలిసి రాజకీయ అడుగులు


రాజకీయ విమర్సలు ఒకవైపు, అధికారుల ఒత్తిడి మరో వైపు దీంతో మానసికంగా ఇబ్బంది పడ్డ శిరీష అంగన్‌వాడీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతే కాదు విమర్సలకు బెదిరిపోయి ఆమె ఇంట్లో కూర్చోలేదు. నేరుగా రాజకీయాల్లోకి భర్తతో కలిసి వచ్చేశారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఇవే ఆమెను అభ్యర్థిగా ఖరారు చేశాయి.  రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గం కావడంతో శిరీషకు బాగా కలిసి వచ్చింది. ఇతర నాయకులతో పోల్చుకుంటే ఇంటర్నల్‌ సర్వేల్లో కూడా ఆమెకు మంచి స్పందన వచ్చిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రంపచోడవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 


అధినాయకత్వం అండ


ఎన్నికలు అంటేనే కోట్లలో డబ్బులు కావాలి ఎలక్షన్స్‌లో నామినేషన్ వేయాలన్న, ప్రచారం చేయాలన్నా, పదిమంది వెనుక రావాలన్నా, ఆఖరికి తనకు ఓట్లు పడాలన్న డబ్బు ఉండాల్సింది. ఇలాంటి పరిస్థితిలో ఈ ఇద్దరు నేతలు ఎలా ఎదుర్కొంటారు అనేది ఆసక్తిగా మారింది. వీళ్లకు స్థానిక నాయకుల అండగా ఉంటున్నారు. అన్నీ తామై చూసుకుంటున్నారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నారు. 


రెండు పార్టీల అధిష్ఠానాలు కూడా ఈ ఇరువురిని గెలిపించుకుకోవాలన్న కసితో పని చేస్తున్నాయి. వాళ్లకు కావాల్సిన ఆర్థిక సాయం చేసేందుకు కూడా అంగీకరించాయని టాక్ నడుస్తోంది. ఓవైపు జగన్‌ మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ సామాన్య వ్యక్తులకు టికెట్‌లు ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది.