Assam Assembly Election Results:  అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార భారతీయ జనతా పార్టీ కూటమి మరోసారి తన విజయకేతనాన్ని ఎగురవేసే దిశగా సాగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో  బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ  కూటమి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని 126 స్థానాలకు గాను మెజారిటీ మార్కును సులువుగా దాటుతూ, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.                                     

Continues below advertisement

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన పట్టును నిరూపించుకుంటూ జలుక్బరి నియోజకవర్గంలో భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ప్రారంభ రౌండ్ల నుంచే ఆయన తన సమీప ప్రత్యర్థిపై స్పష్టమైన మెజారిటీ సాధించి, రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా మరోసారి నిలిచారు. బీజేపీ శ్రేణులు అప్పుడే సంబరాలు మొదలుపెట్టగా, ప్రభుత్వ అభివృద్ధి పనులు,  హిమంత నాయకత్వంపై ప్రజలు మరోసారి నమ్మకం ఉంచారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.                                     

ప్రముఖుల సీట్లలో కూడా బీజేపీ హవా కొనసాగుతోంది. మంత్రులు రంజిత్ కుమార్ దాస్, జయంత మల్లా బారువా తమ తమ స్థానాల్లో ముందంజలో ఉండగా, మిత్రపక్షమైన అసోం గణ పరిషత్   కూడా తన బలాన్ని నిలబెట్టుకుంటోంది. అయితే, కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ జోర్హాట్ నియోజకవర్గంలో గట్టి పోటీని ఎదుర్కొంటూనే ఆధిక్యంలో  ఉన్నారు.   మరోవైపు ఏఐయూడీఎ  అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ప్రభావం గతంతో పోలిస్తే తగ్గినట్లు ప్రాథమిక ట్రెండ్స్ సూచిస్తున్నాయి.                     

Continues below advertisement

విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని అసోం సన్మిలితో మోర్చా  కొన్ని స్థానాల్లో గట్టి సవాలు విసురుతున్నప్పటికీ, అధికార కూటమిని ఢీకొట్టడంలో వెనుకబడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉండటం ఆ పార్టీకి కలిసివచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 85 శాతం పైగా పోలింగ్ నమోదు కావడంతో, ఈ భారీ ఓటింగ్ అధికార పార్టీకి అనుకూలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

 మధ్యాహ్నానికి పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.  బీజేపీ దాదాపు 80 నుంచి 90 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని  ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ ఫలితం గనుక ఖరారైతే, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ఇది అతిపెద్ద విజయంగా నిలుస్తుంది. అస్సాం ప్రజలు స్థిరమైన పాలనకు మరియు అభివృద్ధికి జై కొట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భబేష్ కలిత ధీమా వ్యక్తం చేశారు.