Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌ పంపిణీపై రాజకీయం రాజుకుంది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. ఇవాళ్టి నుంచి జరగాల్సిన సామాజిక పింఛన్ పంపిణీపై రెండు వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


పింఛన్ పంపిణీపై డైలామా


వాలంటీర్‌లతో పింఛన్ పంపిణీ వద్దని... ప్రభుత్వ అధికారులే ఈ ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వాలంటీర్లపై అనేక ఆరోపణలు వస్తున్న వేళ వారితో పంపిణీ చేయిస్తే ఇంకా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈసీ భావించింది. అధికార పార్టీకి వాలంటీర్లు వంతపాడుతున్నారని ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారని అంటున్నారు. అందుకే వారితో పింఛన్‌లు పంపిణీ చేయిస్తే ఓటర్లను ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని ఆలోచించిన ఈసీ ఆ బాధ్యతను అధికారులకు అప్పగించింది. 


మార్గదర్శకాలు ఇవే 


ప్రతి నెల మొదటి రోజే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేసే వాలంటీర్లు ఆ బాధ్యత నుంచి తప్పుకోవడంతో ప్రభుత్వ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఇచ్చిన ఆదేశాలు ఇలా ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకొని పింఛన్లు పంపిణీ చేయాలి. దీని కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ఎంపీడీవోలు, మున్సిలప్ కమిషనర్లు పర్యవేక్షిస్తారు. సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో రెండో తేదీన పింఛన్ల డబ్బులను ప్రభుత్వం విడుదల చేయనుంది. అదేరోజు గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో డబ్బులు డ్రా చేస్తారు. మూడో తేదీ నుంచి పంపిణీ చేపట్టనున్నారు. 


టీడీపీపై వైసీపీ ఫైర్


అసలు పింఛన్లు పంపిణీ ఆలస్యానికి కూటమి పార్టీలే కారణమని వైసీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. చివరకు సామాజిక పింఛన్లు విషయంలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి టీడీపీ, జనసేనకు వాలంటర్లపై కక్ష ఉందని అంటున్నారు. అందుకే ఇప్పుడు ఆ కక్షను ఇలా తీర్చుకుంటున్నారని విమర్శించారు. 


చంద్రబాబుపై ఎస్‌ఆర్‌కే విమర్శలు


ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ నిర్ణయంపై మాట్లాడుతూ... "చంద్రబాబు మొదటి నుంచి వాలంటీర్లపై చిన్న చూపు ఉంది. ఈ వ్యవస్థ వద్దు అనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చు. లేదంటే జన్మభూమి కమిటీలు తీసుకొస్తామని చెప్పవచ్చు. వాలంటీర్లను చూస్తనే చంద్రబాబు భయం వేస్తోంది. చంద్రబాబు పార్టీ ఆఫీస్‌లో తయారు అయ్యే స్క్రిప్టును సిటిజన్ ఫర్ డెమెక్రసీ నేతలు చదువుతున్నారు. కానీ వాలంటీర్ల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు" అని విమర్సలు చేశారు.  


నాని ఆరోపణలు


మరో మాజీ మంత్రి పేర్ని నాని టీడీపీపై విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారంటే..." ప్రజలకు అందాల్సిన పింఛన్లు ఆపేసిన చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఓ వైపు వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతూనే వారి సేవలపై ఆంక్షలు పెట్టడం ఏంటి. ఆ వ్యవస్థను నాశనం చేసే కుట్ర చేస్తున్నారు. సిటిజన్‌ ఫర్ డెమొక్రసీ అనేది చంద్రబాబు  జేబు సంస్థ. ఆ సంస్థ అధ్యక్షుడు భవానీ ప్రసాద్‌ అనేక పదవులు అనుభవించారు. ఇలాంటివారే అంతా కలిసి పింఛన్లు ఇవ్వొద్దని ఆపేశారు" అని చంద్రబాబుపై విమర్శలు చేశారు. 


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవి?


సచివాలయ సిబ్బంది, మిగతా సిబ్బంది ఏమయ్యారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పింఛన్లు పంపిణీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని టీడీపీ ఆరోపించింది. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని అందుకే ఇప్పుడు వేరే సాకులు చెప్పి పింఛన్లు పంపిణీ జరపడం లేదని ఆరోపిస్తున్నారు. పింఛన్లు పంపిణీ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయని వాటిపై ఆలోచన చేయకుండా ప్రతిపక్షాలపై నెపం నెట్టి పబ్బం గడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. 


ఇంటింటికీ ఇవ్వాలని సీఎస్‌కు చంద్రబాబు లేఖ


పింఛన్ల పంపిణీ వివాదంపై సీఎస్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అందులో ఏమన్నారంటే..." సచివాలయ సిబ్బందితో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయించాలి. డబ్బులు డ్రా చేసేందుకు వారికి ప్రత్యేక అనుమతులు ఇవ్వాలి. దీనిపై ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పింఛన్ల డబ్బులను మాత్రం ఇంత వరకు జమ చేయలేదనే సమాచారం ఉంది. వెంటనే డబ్బులు ఆయా ఖాతాల్లో జమ చేయండి. దీనికి కావాల్సిన చర్యలు తీసుకోండి. అని లేఖలో పేర్కొన్నారు. 


డబ్బుల్లేక డ్రామాలా?


ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతోనే పింఛన్లపై డ్రామాలు ఆడుతున్నారని జనసేన టీడీపీ నేతలు కూడా విమర్శలు చేశారు. ప్రభుత్వం వద్ద డబ్బులు ఉంటే పంపిణీ పెద్ద విషయం కాదంటున్నారు. ఇలా పింఛన్ల పంపిణీ ఇప్పుడు ఏపీలో రాజకీయ అస్త్రంగా మారిపోయింది. అధికార ప్రతిపక్షాలు రెండూ దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.