Delhi Election Result 2025: సరైన టైంలో సరైన నాయకుడు ఉన్నప్పుడే దేశమైన రాష్ట్రమైన అభివృద్ధి చెందుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. ఇప్పుడు దేశానికి మోదీ నాయకత్వం చాలా అవసరమని ఇది కొందరికి నచ్చకపోయినా ఇది నిజమని అన్నారు. అదే గ్రహించిన ఢిల్లీ ప్రజలు బీజేపి రాష్ట్ర పగ్గాలు అప్పగించారని వెల్లడించారు. ఢిల్లీ ఫలితాలపై ప్రెస్‌మీట్ పెట్టిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. 


ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దేశ ప్రజలందరికీ నమ్మకం ఉందని అదే తరహాలో ఢిల్లీ ప్రజలు కూదా అదే విశ్వాసంతో బీజేపీకి ఘన విజయం కట్టబెట్టారని పేర్కొన్నారు చంద్రబాబు. దేశ రాజధాని ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఢిల్లీ ప్రజల విజయం మాత్రమే కాదని దేశ ప్రజల ఆత్మగౌరవ గెలుపుగా అభివర్ణించారు. 




చాలా నమ్మకంతో గత పాలకులను ప్రజలు ఎన్నుకంటే అక్కడి సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. ప్రజలకు పంచడం ఒకటే పని అన్నట్టు పాలన చేస్తే చెల్లదని మొదట ఆంధ్రప్రదేశ్‌లో తర్వాత ఢిల్లీలో ప్రజలు కుండబద్దలు కొట్టారని అన్నారు. ఢిల్లీలో వాతావరణం కాలుష్యంతోపాటు రాజకీయ కాలుష్యం కూడా పెరిగిపోయిందని వాటిని తగ్గించడానికే ప్రజలు మోదీకి పట్టం కట్టారని అన్నారు.  


Also Read: అధికారం కోసం రాజకీయాలు చేయలేదు, బీజేపీకి కంగ్రాట్స్: ఓటమిపై కేజ్రీవాల్ వీడియో విడుదల


మంచి పాలన అందించినప్పుడు మంచి రాజకీయాలు సాధ్యమవుతాయన్నారు చంద్రబాబు. కొందరు సంక్షేమం పేరుతో విధ్వంసం సృష్టిస్తే మరికొందరు రాజకీయ కాలుష్యానికి కారణమవుతున్నారని విమర్శలు చేశారు ఏపీ సీఎం. సుస్థిర పాలన ఉన్నందనే గుజరాత్‌ అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందన్నారు చంద్రబాబు. స్థిరమైన పాలన కారణంగా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. అందరు ప్రజలు ఆ దిశగానే ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. 


ఎక్కడైనా మూరుమూల ప్రాంతాల నుంచి రాజధానులకు వలస వెళ్తారని కానీ ఢిల్లీ నుంచి వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు. అక్కడ పెరిగిపోయిన చెత్త, కాలుష్యం ప్రజలను ఉండనీయడం లేదన్నారు. ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తుపై పాలకు కాటు వేశారని విమర్శించారు. సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి తప్పులు తెలుసుకున్న ఏపీ, ఢిల్లీ ప్రజలు చివరకు విజ్ఞత చూపించారన్నారు.   


ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. మోదీపై నమ్మకాన్ని ప్రజలు మరోసారి చాటుకున్నారని అన్నారు. 2047 నాటికి దేశానికి అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చేందుకు ఢిల్లీ ప్రజలు సైతం ముందుకొచ్చారన్నారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు అద్భుతాలు చేయబోతోందని ఆకాంక్షించారు.  




Also Read: ఢిల్లీ ఫలితాలు అన్నా హజారేను సంతోష పెట్టి ఉంటాయి- 'ఆప్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ పరాన్నజీవి', ప్రధాని మోదీ విమర్శలు