Career Options After MBBS in Telugu: వైద్య విద్యలో ఎంబిబిఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా పుచ్చుకోవడం అనేది ఒక సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే. ఒకప్పుడు ఎంబిబిఎస్ పూర్తి చేస్తే సమాజంలో గొప్ప గౌరవం, తక్షణ ఉపాధి లభించేవి. కానీ నేటి పోటీ ప్రపంచంలో ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ పెరుగుతున్న వేళ కేవలం ఒక జనరల్ ఫిజిషీయన్‌గా గుర్తింపు పొందడం సవాలుగా మారింది. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే స్పెషలైజేషన్ లేదా సూపర్ స్పెషలైజేషన్ తప్పనిసరిగా మారింది. వైద్య విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదుర్కొనే ప్రధాన ప్రశ్న ఏంటంటే? పీజీ చేయాలా లేదా డీఎన్బీ మంచిదా, విదేశాలకు వెళ్లి చదవాలా అనే డౌట్స్ చాలా ఉన్నాయి.
పోస్టు గ్రాడ్యుయేషన్
మెజారిటీ వైద్య విద్యార్థులు తమ ఇంటర్న్‌షిప్ పూర్తి కాగానే ఎంచుకునే మార్గం ఎండీ లేదా ఎంఎస్. ఈ కోర్సు పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ద్వారా సీట్లు కేటాయిస్తున్నారు. అయితే భవిష్యత్‌లో దీని స్థానంలో నెక్స్ట్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. రోగులకు మందుల ద్వారా చికిత్స అందించే జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్ వంటివి ఎండీ కిందకు వస్తాయి. సర్జరీలు ప్రధానంగా ఆర్థోపెడిక్స్, గైనకాలజీ వంటివి ఎంఎస్ కిందకు వస్తాయి.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏడాదికి కేవలం 30 వేల నుంచి లక్షల రూపాయల లోపు ఫీజు ఉంటుంది. పైగా వీరికి నెలకు 50 వేల నుంచి 90 వేల వరకు స్టైఫండ్ వస్తుంది. ప్రైవేటు లేదా డీమ్డ్ యూనివర్శిటీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ధర ఏడాదికి 15 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు ఏడాదికి 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉండవచ్చు. మూడు ఏళ్ల కోర్సు పూర్తి అయ్యే సరికి ప్రైవేటు విద్యార్థులపై కోటిన్నర వరకు భారం వడొచ్చు.
డీఎన్బీ అంటే ఏంటీ?
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డు కోర్సులకు ప్రస్తుతం ఎండీ ఎంఎస్‌తో సమానమైన విలువ ఉంది. డీఎన్బీ కోర్సుల్లో అతి పెద్ద ప్లస్ పాయింట్ తక్కువ ఫీజు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏడాదికి 1,25,000 మాత్రమే ఫీజు ఉంటుంది. అలాగే విద్యార్థులకు నెలకు 45 వేల నుంచి 70వేల వరకు స్టైఫండ్ ఇస్తారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండటం వల్ల డీఎన్బీ విద్యార్థులకు క్లినికల్ ఎక్స్‌పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా లభిస్తుంది.
పీజీ డిప్లొమా, బ్రిడ్జ్ కోర్సులు
తక్కువ సమయంలో పీజీ స్థాయి గుర్తింపు పొందాలనుకుంటే రెండేళ్ల పీజీ డిప్లొమా కోర్స్‌లు ఉన్నాయి. వీటిని పూర్తి చేసిన తర్వాత రెండేళ్ల సెకండరీ డీఎన్బీ చేయడం ద్వారా పూర్తి స్థాయి పీజీ డిగ్రీని పొందే అవకాశం ఉంటుంది. ప్రైవేటు కళాశాలల్లో వీటి ఫీజు ఏడాదికి ఆరు లక్షల నుంచి 12 లక్ష వరకు ఉంటుంది.
సూపర్ స్పెషలైజేషన్
వైద్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణులుగా ఎదగాలంటే సూపర్ స్పెషలైజేషన్ తప్పనిసరి, కార్డియాలజీ, న్యూరాలజీ, ఆంకాలజీ వంటి విభాగాలు ఇందులో ఉంటాయి. దీని కోసం ఎండీ, ఎమ్మెస్ పూర్తి చేసిన వారు నీటి ఎస్‌ఎస్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ నుంచి సూపర్ స్పెషలిస్ట్ అయ్యే సరికి ఒక డాక్టర్ వయసు 30 నుంచి 32 ఏళ్లు వస్తుంది. కోర్సు పూర్తి అయిన తర్వాత వీరి ప్రారంభ జీతం నెలకు 2.5 లక్షల నుంచి 5 లక్షలపైబడే ఉంటుంది.
అంతర్జాతీయ అవకాశాలు
భారతీయ వైద్యులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. అమెరికాలో స్థిరపడాలనుకునే వారు యూఎస్‌ఎంఎల్‌ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దీని ప్రిపరేషన్, పరీక్షల కోసం పది లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. బ్రిటన్ వెళ్లాలనుకునే వారు ప్లాబ్ పరీక్ష ద్వారా ఎన్‌హెచ్‌ఎస్‌లో వైద్యాధికారిగా చేరవచ్చు.
ఎంబిబిఎస్ తర్వాత ఏ కోర్సు ఎంచుకోవాలనేది కేవలం ర్యాంకుపైనే కాకుండా, వ్యక్తిగ ఆసక్తి, కుటుంబ ఆర్థిక పరిస్థితి, మనం కేటాయించగలిగే సమయంపై ఆధారపడి ఉండాలి. ప్రైవేటు సీట్ల కోసం భారీగా అప్పులు చేసే ముందు, ఆ పెట్టుబడికి తగిన ప్రతిఫలం ఎంత కాలంలో వస్తుందో బేరీజు వేసుకోవడం డాక్టర్లకు, వారి కుటుంబాలకు ఎంత ముఖ్యం.
