UGC NET 2024 Cancelled: నీట్ ఎగ్జామ్ లో అవకతవకలు జరిగాయని కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరసన, ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తుండగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్-2024 పరీక్షను రద్దు చేసింది. నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం రావడంతో.. పారదర్శకతను కాపాడటం కోసమే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. మళ్లీ యూజీసీ నెట్ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 19న అధికారిక ప్రకటన విడుదల చేసింది. నీట్ 2024 పరీక్ష సహా పలు పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా జూన్ 18న 317 నగరాల్లోని 1,205 సెంటర్లలో యూజీసీ నెట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్, పెన్ (OMR) విధానంలో నిర్వహించింది. పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 11.21 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 6.35 లక్షల మంది మహిళలు, 4.85 లక్షల మంది పురుషులు ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ అభ్యర్థులు 59 మంది ఉన్నారు. ఈ పరీక్షకు మొత్తం 9.08 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ లీకేజీ వదంతులు రావడంతో పరీక్షల్లో పారదర్శకతను కాపాడుకోవడం కోసమే పరీక్ష రద్దు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.
జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష విజయవంతంగా ముగిసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అయితే ఇంతలో పేపర్ లీక్ అయిందని నేషనల్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ కమిటీ నుంచి సమాచారం అందడంతో ఎన్టీఏ యూజీసీ నెట్ పరీక్షను కేంద్రం రద్దు చేసింది. రద్దుచేసిన పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది అన్నదానిపై త్వరలోనే ప్రకటన చేస్తామని కేంద్రం తెలిపింది. తాజా అప్‌డేట్ల కోసం వెబ్‌సైట్ చూడాలని సూచించింది.
నీట్‌పై నిర్ణయం బిహార్ ప్రభుత్వానిదే..
దేశంలోని మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన నీట్ పేపర్ లీకేజీపై వస్తోన్న ఆరోపణలపైనా కేంద్రం స్పందించింది. ఇప్పటికే సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నీట్ అవకతవకలపై బిహార్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ విచారణ జరుగుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రాథమిక ఆధారాల మేరకు నీట్‌లో అవకతవకలు జరిగినట్టు నిర్థరణకు వచ్చామని, బిహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన కేంద్రం..
దేశవ్యాప్తంగా జూన్ 18న యూజీసీ నెట్- 2024 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ OMR విధానంలో రెండు షిఫ్టుల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. యూజీసీ నెట్ పరీక్ష లీకేజీ గురింది కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ నుంచి వచ్చిన సమాచారం మేరకు పరీక్షను రద్దు చేశారు. పరీక్ష పారదర్శకత, సమగ్రతపై రాజీపడకుండా ఉండేందుకు నెట్‌ను రద్దు చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించింది.