CPGET 2023 Final Phase Seat Allotment: తెలంగాణలోని పీజీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన సీపీగెట్ చివరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు నవంబరు 15న అధికారులు సీట్లను కేటాయించారు. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ల కేటాయింపు వివరాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు హాల్‌టికెట్ నెంబరు, ర్యాంకు వివరాలు నమోదుచేసి సీటు కేటాయింపు వివరాలు చూసుకోవచ్చు. తుది విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 11,325 సీట్లు అందుబాటులో ఉండగా.. 6,491 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత ఇంకా 4834 సీట్లు మిగిలిపోయాయి.
సీట్లు పొందిన వారు నవంబరు 18లోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్‌తోపాటు స్వయంగా కళాశాలలో ఒరిజినల్ టీసీ సమర్పించాల్సి ఉంటుంది. ఇతర ధ్రువపత్రాలైన ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ మెమోలు, కులం, ఈడబ్ల్యూఎస్, ఆదాయం తదితర వాటిని కేవలం పరిశీలనకు మాత్రమే చూపాలి. విద్యార్థుల నుంచి ఒరిజనల్ టీసీ మాత్రమే తీసుకోవాలని ప్రిన్సిపల్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సీపీగెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నవంబరు 5 నుంచి 8 వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న అభ్యర్థులు నవంబరు 9 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్నారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి నవంబరు 15న సీట్లను కేటాయించారు.
ఎంఈడీ, ఎంపీఈడీ సీట్ల కేటాయింపు..
తెలంగాణలో పీజీ కోర్సులకు సంబంధించి తుది విడతతోపాటు ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థులకు కూడా సీట్లను కేటాయించారు. పీజీ ప్రవేశాలకు ఇప్పటివరకు మూడు విడతల కౌన్సెలింగ్ ముగియగా, చివరి విడతలో ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో సీట్ల భర్తీని చేర్చిన సంగతి తెలిసిందే. నవంబరు 15న అభ్యర్థులకు అధికారులు సీట్లను కేటాయించారు.
సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ సెప్టెంబరు 29న పూర్తయిన సంగతి తెలిసిందే. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సులకు సంబంధించి మొత్తం 30,176 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోగా.. 22,599 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో 16,496 మంది అమ్మాయిలే కావడం విశేషం. అంటే 73 శాతం సీట్లు అమ్మాయిలకే కేటాయించారు. ఇక అబ్బాయిల విషయానికొస్తే కేవలం 6,103 మాత్రమే సీట్లు పొందారు.
సీపీగెట్-2023 పరీక్షలను జూన్ 30 నుంచి జూలై 10 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు 22,468 మంది పురుషులు, 45,954 మంది మహిళలు సహా మొత్తం 68,422 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఫలితాలు ఆగస్టు 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మొత్తం 93.42 శాతం మంది అర్హత సాధించారు. అందులో 19,435 మంది పురుషులు, 40,230 మంది మహిళలు సహా మొత్తం 59,665 మంది పరీక్షలు రాశారు. వారిలో 18,172 మంది పురుషులు, 37,567 మంది మహిళలు సహా మొత్తం 55,739 మంది క్వాలిఫై అయ్యారు.
ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతోపాటు హైదరాబాద్ జేఎన్‌టీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.