Telangana Tenth Class Exams: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయిగా భావంచే పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్షల మంది విద్యార్థులు భవిష్యత్‌ను నిర్ణయించే ఈ పరీక్షాపర్వం ఏప్రిల్ 16 వరకు కొనసాగనుంది. అటు ప్రభుత్వం, ఇటు విద్యాశాఖ ఉన్నతాధికారులు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. 

Continues below advertisement

ముఖ్యమంత్రి, గవర్నర్ శుభాకాంక్షలు

పరీక్షలకు హాజరవుతున్న లక్షల మంది విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. పదో తరగతి పరీక్షలు భవిష్యత్‌కు తొలి మెట్టు అని, విద్యార్థులు ఎవరూ భయం, ఆందోళన లేకుండా ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. ఆత్మ విశ్వాసంతో, ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాసి ప్రతిభను చాటుకోవాలని సీఎం ఆకాంక్షించారు. 

తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా కూడా విద్యార్థులకు తన సందేశాన్ని పంపారు. పరీక్షలు ఒక భారంలా కాకుండా, తమ జ్ఞానాన్ని ప్రదర్శించే అద్భుతమైన అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. సానుకూల దృక్పథం క్రమశిక్షణతో కూడిన సమయపాలన విజయానికి మార్గాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల వెనుక ఉండి వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, గురువుల కృషిని కూడా గవర్నర్‌ ఈ సందర్భంగా అభినందించారు. 

Continues below advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 5, 17, 727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం ప్రభుత్వం మొత్తం 2, 676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 1582 కేంద్రాలు, ప్రైవేటు పాఠశాలల్లో 1,094 కేంద్రాలను కేటాయించారు. 

మార్చీ 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు జరగనున్నాయి. ఉదయం పరీక్ష ప్రారంభమైన తర్వాత కేవలం ఐదు నిమిషాల వరకు మాత్రమే ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. అంటే ఉదయం 9.35 గంటల తర్వాత వచ్చే విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు కనీసం గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

పరీక్షల పారదర్శకత కోసం విద్యాశాఖ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. పరీక్ష కేంద్రాలకు పూర్తి స్థాయిలో నో సెల్‌ ఫోన్‌ జోన్లుగా ప్రకటించారు. విద్యార్థులే కాదు, పరీక్ష సిబ్బంది, ఇన్విజిలేటర్లు, చివరకు చెక్ చేయడానికి వచ్చే స్క్వాడ్ అధికారులు కూడా సెల్‌ఫోన్లను లోపలికి తీసుకెళ్లకూడు. ఒక వేళ ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే వారిని సస్పెండ్ చేస్తారు. పరీక్షా పత్రాల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏ ఉద్యోగి అయినా పేప్ లీకేజీలు పాల్పడిదే వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. విద్యార్థుల సౌకర్యార్థం మోడల్ OMR షీట్లు, జవాబు పత్రాల ఫార్మట్‌ను బోర్డు అధికారికంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్షకు వెళ్లే ముందే వీటిని పరిశీలించడం ద్వారా విద్యార్థులు పరీక్షా సమయంలో తడబాటు లేకుండా ఉంటారు.