Telangana SSC Exam Results | హైదరాబాద్: కొన్ని రోజుల కిందట ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్. ఇక టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు (TG SSC Results) విడుదలకు ప్రభుత్వ పరీక్షల విభాగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 29న లేదా 30న ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని సమాచారం. ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 13 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకాగా, ఏప్రిల్ 23 నాటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/

Continues below advertisement

ముందుగా ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రక్రియ వేగవంతం కావడంతో ఏప్రిల్ నెలాఖరులోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫలితాల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ముఖ్య అతిథిగా హాజరై టెన్త్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఒకవేళ టెక్నికల్ కారణాల వల్ల ఏప్రిల్ 29న ఫలితాల విడుదల వీలుకాకపోతే, మరుసటి రోజు 30వ తేదీన టెన్త్ రిజల్ట్స్ వెల్లడి కావడం ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు (TS Intermediate Results)తెలంగాణలో 2 వారాల కిందటే ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్ 12న విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సెకండియర్ విద్యార్థులు 70.58 శాతం ఉత్తీర్ణత సాధించగా, జనరల్ విభాగంలో మొత్తం 4,11,474 మందికి గాను 3,11,112 మంది పాసయ్యారు. బాలికలు 1,74,136 మంది ఉత్తీర్ణతతో పైచేయి సాధించగా, బాలురు 1,36,976 మంది పాసయ్యారు; అలాగే ఒకేషనల్ విభాగంలో 72.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు అధికారులు ప్రకటించారు.

Continues below advertisement

ఇక ఇంటర్ ఫస్టియర్‌లో 66.94 శాతం మంది జనరల్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 1,67,045 మంది మరియు బాలురు 1,28,734 మంది పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో 59.30 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, మొత్తంగా ఇంటర్ ఫలితాల్లో బాలికలే అత్యధిక శాతం ఉత్తీర్ణతతో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.