Telangana Inter Results 2025: తెలంగాణలో ఇంటర్ వార్షికల పరీక్షల ఫలితాలను ఏఫ్రిల్ 22న ప్రకటించనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లోనూ ఫలితాలను చూసుకోవచ్చు. రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించగా... పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోపే ఫలితాలను వెల్లడించనుండటం విశేషం. ఏపీలో ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12న వెల్లడించిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో ఇంటర్ ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఇంటర్మీడియట్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా జవాబుపత్రాల మూల్యాంకనంలో ఈసారి ముందస్తు పునఃపరిశీలన చేసింది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన తర్వాత మార్కులు సరిగా రాలేదని, లెక్చరర్లు చేసిన తప్పిదం వల్లే తాము ఫెయిల్ అయ్యామని విద్యార్థులు ఆరోపిస్తుంటారు. ఈ నేపథ్యంలో 35 మార్కులు రాని విద్యార్థులకు సంబంధించి జవాబుపత్రాలను చీఫ్ ఎగ్జామినర్, సబ్జెక్టు నిపుణులతో క్షుణ్నంగా పునఃపరిశీలన చేయించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉంటుందని వారంటున్నారు. ఏప్రిల్ 10 నాటికి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనం పూర్తికాగా.. ఫలితాలను ఏప్రిల్ 22న వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకెండియర్ కలిపి మొత్తం 9 లక్షల 96వేల 971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. వీరందరి అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు 60 లక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం పూర్తిచేసిన ఇంటర్ బోర్డు.. ఫలితాల వెల్లడికి సిద్దమవుతోంది. వేసవి సెలవుల తర్వాత జూన్ 2 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి.
తెలంగాణలో ఈసారి కూడా పాతవిధానంలోనే ఇంటర్ ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి ఆన్‌లైన్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ భావించిన సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్ విధానం అమలు చేయాలంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు గ్రేడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక్కో కళాశాలకు ఫీజు నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు జరగలేదు. దీంతో అది కష్టమని ఇంటర్‌బోర్డు నిర్ణయానికి వచ్చింది.
ఒకవేళ ప్రభుత్వం ఫీజులు నిర్ణయించినా తాము జేఈఈ, ఎప్‌సెట్, నీట్ తదితర పోటీపరీక్షలకు కూడా శిక్షణ ఇస్తామని, హాస్టళ్లు ఉన్నాయని, ఫీజులను ఎలా నిర్ణయించారంటూ కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఇంటర్‌బోర్డు.. వచ్చే విద్యా సంవత్సరానికి పాత విధానమే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ధ్రువీకరించారు.
తెలంగాణలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏప్రిల్ 3న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. మే 4 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆలస్య రుసుంతో జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును బోర్డు కల్పించింది.