Inter Academic Calendar :  తెలంగాణ ఇంటర్ బోర్డు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. జులై 1వ తేదీ నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభించనున్నట్లు బోర్డు ప్రకటించింది. జూన్ 15న రెండో సంవత్సరం క్లాసులు ప్రారంభంకానున్నట్లు తెలిపింది. 2022-23 విద్యాసంవత్సరంలో మొత్తం 221 పనిరోజులతో షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ఖరారు చేసింది. అక్టోబరు 2-9వ తేదీ వరకు దసరా సెలవులు, వచ్చే ఏడాది జనవరి 13-15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, ఫిబ్రవరి 6-13 మధ్య ప్రీ ఫైనల్స్‌ పరీక్షలు నిర్వహించనుంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు, ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు బోర్డు పేర్కొంది.


పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు


తెలంగాణలో నిర్వహించనున్న కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఏ డిగ్రీ పాసైన విద్యార్తులైనా ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన ఉపకులపతులతో (Vice Chancellor Of Universities In Telangana) ఉన్నత విద్యా మండలి సోమవారం భేటీ అయింది. వచ్చే విద్యా సంవత్సరంలో పీజీ కోర్సులలో మార్పులపై స్పందించారు.


ఈ ఏడాది సైతం ఓయూకే బాధ్యతలు 


ఈ ఏడాది నిర్వహించనున్న కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 ( Telangana CPGET 2022) నుంచి పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా వారికి ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీలో అడ్మిషన్ పొందే అవకాశం కల్పించారు. గతంలో మాదిరిగానే ఈ ఏడాది సైతం కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టు నిర్వహణ బాధ్యలు ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి పేర్కొంది. మే నెలాఖరుకల్లా టీఎస్ సీపీజీఈటీ 2022 (TS CPGET 2022 Notification) నోటిఫికేషన్ చేయనున్నట్లు తెలిపారు.


ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జీరో అడ్మిషన్లు (Decision On Zero Admission Colleges) నమోదైన కాలేజీలు, కోర్సులను రద్దు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఓ కోర్సులో 15 మంది కంటే తక్కువ విద్యార్థులు అడ్మిషన్ పొందితే వారిని ఇతర కోర్సులకు ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా వారిని డిస్టెన్స్‌ (Distance Education)లో చదివే అవకాశం కల్పించాలని వర్సిటీల వీసీలకు ఉన్నత విద్యా మండలి సూచించింది.