AP Schools Summer Holidays: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులు ముందుగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు ఈసారి భారీగానే సెలవులు రానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే మార్చి 18 నుంచి ఒంటి బడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. గతేడాది తరహా ఈసారి కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో విద్యాశాఖ అధికారులు బడులకు ముందుగానే సెల‌వులు ఇచ్చే ఆలోచ‌న‌ చేస్తున్నారు. 


ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు?
ఏపీలోని పాఠశాలలకు గతేడాది మే 1న వేసవి సెలవులు ప్రారంభంకాగా.. 42 రోజుల సెలవుల తర్వాత జూన్ 12న తిరిగి తెరచుకున్నాయి. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్రత కారణంగా  ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేస‌వి సెల‌వులు(AP Summer Holidays) మొదలుకానున్నాయి. జూన్ 13 వ‌రకు అంటే.. దాదాపుగా 50 రోజులు పాటు పాఠశాలలకు వేస‌వి సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉందని సమాచారం. గతేడాది కంటే ఈసారి సమ్మర్ హాలీడేస్ ఎక్కువగా ఇచ్చే అవ‌కాశం ఉందని తెలుస్తోంది.  అయితే వేసవి సెలవులపై విద్యాశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ప‌దో త‌ర‌గ‌తి(AP SSC Exams) విద్యార్థుల‌కు పరీక్షలు పూర్తయిన వెంటనే సెలవులు ప్రకటిస్తారు. మార్చి 18 నుంచి మార్చి 30వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దీంతో పదో తరగతి విద్యార్థుల‌కు దాదాపుగా 60 రోజులు పాటు వేస‌వి సెల‌వులు రానున్నాయి. గత ఏడాది స్కూళ్లకు మే 1 తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఏప్రిల్‌ 23 వరకూ ఒంటిపూట బడులు..
ఏపీ వ్యాప్తంగా మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు(AP Half Day Schools) ప్రారంభం అయ్యాయి. విద్యాశాఖ ఆదేశాల మేరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి (1 to 9th Class) వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు విద్యార్థులకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, అన్ ఎయిడెట్, మెడల్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో హాప్ డేస్ నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 23 వరకు రాష్ట్రంలోని స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. పదోతరగతి (AP SSC Exams) పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలో పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. 


ఏప్రిల్ 6 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు..
ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 6 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్(SA)-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే 9వ తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే షెడ్యూలులో మార్పులుంటాయని విద్యాశాఖ తెలిపింది.


ఎస్‌ఏ-2 పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..