ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ మార్కుల ఒరిజినల్ మెమోల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గొప్ప ఊరటనిచ్చే వార్త ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. జూనియర్ కాలేజీలకు ఇంటర్ పాస్ సర్టిఫికెట్లను పంపుతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరవ్ గౌర్ అక్టోబరు 7న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సర్టిఫికేట్ల ప్రింటింగ్ ప్రక్రియ శనివారం(అక్టోబరు 7)తో పూర్తికావడంతో ఆదివారం (అక్టోబరు 8) నుంచి ఆర్‌ఐవోల ద్వారా ఆయా కాలేజీలకు పాస్ సర్టిఫికెట్లను పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా ఆర్‌ఐవో పరిధిలోని కాలేజీలకు ఇప్పటికే వీటిని పంపామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేస్తూ విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో శనివారం నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పాల్గొనడంతో పాటు శ్రీ దుర్గా మల్లేశ్వరి మహిళా జూనియర్ కాలేజీ, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ, ఫిట్జీ జూనియర్ కాలేజీల్లో నిర్వహించిన కార్యక్రమాలను సైతం ఆయన సందర్శించారన్నారు.
అక్టోబరు 10 నుంచి తీసుకోవచ్చు..
ఇంటర్ పాసైన విద్యార్థులు మార్కుల జాబితాలను సోమవారం (అక్టోబరు 10) నుంచి సంబంధిత కాలేజీల్లో పొందవచ్చని సౌరవ్ గౌర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ విద్యామండలి విద్యార్థులకు డీజీలాకర్ ద్వారా విద్యార్థులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 2023 సర్టిఫికెట్లను సైతం డిజీలాకర్‌లో నిక్షిప్తం చేసినందున విద్యార్థులు కాలేజీ మెమోలతో పాటు ఈ సేవలను కూడా సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. 2013-23 మధ్య కాలంలో 45.53లక్షల విద్యార్థులకు సంబంధించి డీజీలాకర్‌లో పాస్ సర్టిఫికెట్లతో పాటు మైగ్రేషన్, ఈక్వలెన్సీ, అర్హతా సర్టిఫికెట్లను పొందుపరిచామని తెలిపారు. ఫిజికల్ డాక్యుమెంట్లతో సమానంగా డిజీలాకర్ ఎలక్ట్రానిక్ కాపీలను అన్ని విద్యా సంస్థలు అనుమతించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2020లో ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు అన్ని విద్యా సంస్థలు అంగీకరించినట్లు ఆ ప్రకటనలో సౌరవ్ గౌర్ తెలిపారు.
5 నెలల తర్వాత మెమోలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు వచ్చిన 5 నెలల తర్వాత విద్యార్థులకు ఒరిజినల్ మెమోలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్టిఫికెట్ల కోసం సుమారు 3,78,000 మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఐఐటీ, నిట్, ట్రిపుల్‌ఐటీలు ఇచ్చిన గడువు సెప్టెంబరు 30తో ముగియడంతో విద్యార్థులను అయా విద్యాసంస్థలు ఒరిజినల్ మెమోలు ఇవ్వాలని అడుగుతున్నాయి. దీంతో.. కొందరు విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యామండలికి వచ్చి త్వరలోనే మెమోలు ఇస్తామని అధికారుల నుంచి లేఖలు తీసుకొని వెళ్ళారు. సాధారణంగా ఆగస్టులోనే మెమోలు ఇవ్వాల్సి ఉండగా.. ముద్రణకు ఇచ్చేందుకే ఇంటర్మీడియట్ విద్యా మండలి చాలా సమయం తీసుకుంది. అయినా.. ఒరిజినల్ మెమోలు సకాలంలో విద్యార్థులకు అందించలేకపోవడం గమనార్హం.
ALSO READ:
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, దరఖాస్తుకు డిసెంబరు 31 వరకు గడువు
తెలంగాణలో ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై... ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు 'నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్'కు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్ అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు గడువు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంటర్ మార్కుల్లో టాప్-20 పర్సంటైల్‌లో నిలిచిన 53,107 మంది ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యార్థులతోపాటు గతంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన వారు కూడా రెన్యువల్ కోసం డిసెంబరు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..