CBSE First class admission Row : కేంద్రం తీసుకు వచ్చిన కొత్త విద్యావిధానంలో ఆరేళ్లు నిండిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పించాలనే రూల్ పెట్టింది. ఇది చాలా మంది తల్లిదండ్రులకు సమస్యగా మారింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న వయోపరిమితి వివాదంపై విస్తృత చర్చ జరుగుతోంది. జాతీయ విద్యా విధానం నిబంధనల ప్రకారం.. ఒకటో తరగతిలో చేరాలంటే జూన్ 1 నాటికి ఖచ్చితంగా 6 ఏళ్లు నిండి ఉండాలి. అయితే, ఈ నిబంధన వల్ల కేవలం కొన్ని రోజుల తేడాతో అర్హత కోల్పోతున్న వేలాది మంది పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే మూడు సంవత్సరాల ప్రీ-ప్రైమరీ విద్యను పూర్తి చేసిన తమ పిల్లలను మళ్ళీ అదే తరగతిలో (UKG) కూర్చోబెట్టడం వల్ల వారిపై తీవ్ర మానసిక ఒత్తిడి పడుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం నిరసన కాదు, ప్రభుత్వానికి చేస్తున్న విన్నపం అని పేర్కొంటూ బెంగళూరులో తల్లిదండ్రులు ప్రదర్శన నిర్వహించారు. కనీసం 90 రోజుల సడలింపు ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీనివల్ల కొన్ని రోజుల వయస్సు తక్కువగా ఉన్న పిల్లలు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఒకటో తరగతికి వెళ్లే అవకాశం ఉంటుందని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు తీసుకోవడం పాఠశాలలకు తప్పనిసరి అయినప్పటికీ, విద్యా సంస్థలు కూడా తల్లిదండ్రుల వైపు మొగ్గు చూపుతున్నాయి. పిల్లలు ఒకే తరగతిని మళ్ళీ చదవడం వల్ల వారి ఆసక్తి తగ్గిపోతుందని, విద్యా సంవత్సరం వృధా కాకుండా ఉండటానికి ప్రభుత్వం ఏదో ఒక మార్గం చూపాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.
కర్ణాటక విద్యాశాఖ గతంలోనే 6 ఏళ్ల నిబంధనను 2025-26 విద్యా సంవత్సరం నుండి కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. గతంలో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ, ఈసారి నిబంధనలను కఠినతరం చేయాలని చూస్తోంది. అయితే, తల్లిదండ్రుల నుండి వస్తున్న భారీ ఒత్తిడి కారణంగా ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఒకవేళ ప్రభుత్వం 90 రోజుల మినహాయింపు ఇస్తే, అది వేలాది మంది విద్యార్థులకు ఊరటనిస్తుంది. వయోపరిమితి విషయంలో శాస్త్రీయ దృక్పథం అవసరమని కొందరు విద్యావేత్తలు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల భవిష్యత్తు మరియు సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి , ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని బెంగళూరులోని పాఠశాలలు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
