ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య అధికంగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 500కి పైగా కాలేజీలుఉన్నాయి. ఆయా కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం లక్షకుపైగా ఇంజినీరింగ్‌ విద్యార్థులు పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్నారు. అయితే వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే వెంటనే ఉద్యోగాలు పొందుతున్నారు. దీనికి కారణం ఉద్యోగాలకు సరిపడా నైపుణ్యాలు వారిలో లేకపోవడమే. ఇంజినీరింగ్‌ చేసిన విద్యార్థుల్లో కేవలం 20 శాతం మందికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉంటున్నాయని 'నాస్కామ్‌' అధ్యయనంలో వెల్లడైంది.


పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో నైపుణ్యాలు కానరావడంలేదు. ఇంజినీరింగ్‌ పూర్తయినా.. మళ్లీ ఇతరత్రా కోర్సులు చేసి స్కిల్స్‌ అభివృద్ది చేసుకుంటేనే ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. దీనివల్ల పేద విద్యార్థులే ఎక్కువగా నష్టపోతున్నారు. ఇంజినీరింగ్‌ చదవడానికే లక్షల్లో ఫీజులు కట్టుకోవాల్సిన నేపథ్యంలో.. స్కిల్స్ కోసం మరింత ఖర్చుపెట్టాలంటే అదనపు భారం తప్పడం లేదు. కొన్ని ఇంజినీరింగ్ కళాశాలలైతే పైసల కోసమే అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాల మెరుగుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. నాలుగేళ్ల చదువు గడిచిందా లేదా.. పాసయ్యారా లేదా అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు.


విద్యార్థులు కూడా విద్యార్హతతో సంబంధం లేకుండా ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగంలో చేరిపోతున్నారు. ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ప్రధానంగా డోమైన్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ తప్పనిసరిగా ఉండాలి. అంటే విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నైపుణ్యాన్ని కల్గిఉండటమే కాకుండా.. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కలిగి ఉండాలి. ముఖ్యంగా ఇంగ్లిష్‌ భాషపై మంచి పట్టు ఉండాలి. ఈ రెండు నైపుణ్యాలు ఉన్నవారు ఏపీలో కేవలం 20 శాతం మంది మాత్రమే ఉంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్‌ విద్యార్థులతోపాటు మామూలు డిగ్రీ చదివే విద్యార్థుల్లో కూడా నైపుణ్యాలు పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది.


ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి..
ఇంజనీరింగ్‌ విద్యార్ధుల తోపాటు డిగ్రీ చదవుతున్న విద్యార్ధులకు కూడా ఉన్నత విద్యా మండలి తప్పనిసరి ఇంటర్నెషిప్‌లను అమల్లోకి తెచ్చింది. ప్రతి ఒక్కరు పది నెలలపాటు ఏదోక పరిశ్రమలో ఇంటర్నెషిప్‌ చేయాల్సి ఉంటుంది. దీని వలన ఆ సంబంధిత పరిశ్రమలో పనిచేయగలిగే నైపుణ్యాలు ఆ విద్యార్ధికి అలవాడతాయి. దీంతోపాటు మైక్రోసాఫ్ట్‌ తో ఉన్నత విద్యా మండలి ఓ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం లక్షా 62 వే మందికి అప్‌ స్కిల్‌ ఇంప్రూమెంట్‌ను మెక్రోసాఫ్ట్‌ అందిస్తుంది. దీంతోపాటు విద్యార్ధులకు అన్‌లైన్‌లో కూడా స్కిల్‌ను పెంపొందించుకునే అవకాశాన్ని కల్గిస్తోంది. ఇది కాకుండా కరిక్యులమ్‌లోనే 30 శాతం నైపుణ్యాలు పెంచుకునేలా తయారు చేశారు. ఈచర్యల న్నింటి ద్వారా విద్యార్ధులు తమ డొమైన్‌ స్కిల్స్‌ను బాగా అభివృద్ది చేసుకునే అవకాశం కలుగుతుంది.


ఇంగ్లిష్‌పై పట్టు ఉండాల్సిందే...
విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్క్ పెరగాలంటే ఇంగ్లిష్‌ భాషపై పట్టు ఉండాల్సిందే. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాఠశాల స్థాయితో పాటు ఉన్నత విద్యలోనూ తప్పనిసరిగా ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల విద్యార్ధులు తప్పనిసరిగా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతోపాటు ఇంగ్లిష్‌ వర్క్‌బుక్స్‌ను రూపొందించారు. విద్యార్థులు ఈ వర్క్‌బుక్‌లను చదవడం ద్వారా ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాలు వారిలో పెరుగుతాయి. ఇంగ్లిష్‌లో ఉచితంగా ఉపన్యాసాలు అందుబాటులో ఉంచేందుకు ఉన్నత విద్యా మండలి సైలర్‌ అకాడమీతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఉపన్యాసాలను వినడం ద్వారా విద్యార్థులు ఇంగ్లిష్‌లో చక్కగా మాట్లాడే నైపుణ్యం అలవడుతుంది. ఇవేకాకుంగా ఇంకా చాలా రకాలుగా విద్యార్థులో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ఉన్నత విద్యామండలి కృషి చేస్తూనే ఉన్నాయి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..