జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ పరీక్షలకు ఇంటర్‌లో కనీస మార్కుల నిబంధనను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్ర విద్యాశాఖ, జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ)లు భావిస్తున్నాయి. ప్రవేశాలు పొందాలంటే జేఈఈలో ర్యాంకుతోపాటు ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యారులు 65 శాతం, ఇతరులు 75 శాతం మార్కులు పొందటం తప్పనిసరి. కరోనా మహమ్మారి కారణంగా చాలా రాష్ట్రాల్లో ఇంటర్ లేదా 12వ తరగతి వార్షిక పరీక్షలు జరగలేదు. ఈ నేపథ్యంలో 2020 నుంచి 2022 వరకు ఆ నిబంధనలను ఎత్తివేశారు. ఇంటర్ కనీస మార్కులతో పాసైనవారూ ప్రవేశ పరీక్ష ర్యాంకుతో ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేలా వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు సాధారణ పరిసితులు నెలకొన్నందున జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్-2023కు మళ్లీ పాత నిబంధనలను అమలు చేయాలని జేఈఈ మెయిన్‌ను నిర్వహించే ఎన్‌టీఏ, అడ్వాన్స్‌డ్‌ను జరిపే ఐఐటీలు ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం.
మెయిన్ నిర్వహణపై సందిగ్ధత
జేఈఈ మెయిన్‌ను జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించాలని భావిస్తున్న ఎన్‌టీఏ.. ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం విద్యారులను అయోమయానికి గురిచేస్తోంది. మొదటి విడత జనవరిలో నిర్వహించని పక్షంలో ఫిబ్రవరి, మార్చిలో జరిపేందుకు కొన్ని అడ్డంకులున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు మొదలవుతాయి. ఇతర రాష్ట్రాల్లో మార్చిలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో ప్రయోగ పరీక్షలు, మార్చిలో ఇంటర్ పరీక్షలు ఉంటాయి. వాస్తవంగా నోటిఫికేషన్‌కు, పరీక్షకు మధ్య కనీసం 40 రోజుల వ్యవధి ఉండాలి. ఆ ప్రకారం ఈ వారంలో ప్రకటన జారీ చేస్తేనే జనవరి నెలాఖరులో పరీక్ష జరిపేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ జనవరిలో నిర్వహించలేని పక్షంలో ఏప్రిల్, మే నెలల్లో జరుపుతామంటూ అధికారికంగా ప్రకటిస్తే విద్యారులకు సన్నద్ధతపై స్పష్టత వస్తుంది. ఎన్‌టీఏ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.
జేఈఈ మెయిన్, సీయూఈటీ, నీట్ ఎగ్జామ్స్‌కు ఫిక్స్‌డ్ క్యాలెండర్?
జేఈఈ మెయిన్, నీట్, సీయూఈటీ వంటి పరీక్షలకు వచ్చే ఏడాది నుంచి ఫిక్స్‌డ్ క్యాలెండర్‌ను రూపొందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్, మెడికల్, అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం పరీక్షల షెడ్యూల్‌ను క్రమబద్ధీకరించడానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ వారంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. యూజీసీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఫిక్స్‌డ్ ఎగ్జామ్ క్యాలెండర్‌పై ఒక కమిటీ పనిచేస్తోంది. వివిధ పరీక్షలకు ఔత్సాహికులు మెరుగ్గా ప్రిపేర్ కావడానికి ప్రామాణిక క్యాలెండర్ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షలు జనవరిలో జరగాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ నిలిపివేసి, కొత్తగా దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష తేదీలను ఎన్‌టీఏ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
జనవరి- ఏప్రిల్ మధ్య జేఈఈ
జేఈఈ (మెయిన్) పరీక్షలు జనవరి- ఏప్రిల్ నిర్వహించనున్నారు. సీయూఈటీ-యూజీ పరీక్షలు ఏప్రిల్ మూడోవారం నుంచి మే మొదటి వారం మధ్య జరిగే అవకాశం ఉంది. నీట్-యూజీ పరీక్ష మే మొదటి ఆదివారంలో నిర్వహించవచ్చు. అయితే కచ్చితమైన తేదీలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ క్యాలెండర్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ ప్రాబబులిటీ సమయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. కరోనా కారణంగా 2020 నుంచి పోటీ పరీక్షల షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడింది. జేఈఈ మెయిన్ ఫస్ట్ సెషన్ ఏప్రిల్‌లో నిర్వహిస్తే చాలా మంది అభ్యర్థులు మూడు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఎటువంటి గ్యాప్ లేకుండా బ్యాక్-టు-బ్యాక్ పరీక్షలకు హాజరుకావచ్చు. వివిధ కారణాల వల్ల ఒక అభ్యర్థి ఒక పరీక్షకు హాజరు కాలేకపోతే, సన్నద్ధం కావడానికి కొంత సమయం లభిస్తుంది. అయితే బ్యాక్-టు-బ్యాక్ పరీక్షలు ఈ ప్రయోజనాన్ని అందించవచ్చు. జేఈఈ మెయిన్-జనవరి సెషన్ కోసం ఈ వారం నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా, ఇతర పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌లు వరుసగా మార్చి, ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read:
➨ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇక ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ఎంసెట్ కోచింగ్!
➨ కామ్‌గా 'బీకామ్'లో చేరిపోయారు, 'బీటెక్'ను మించి ప్రవేశాలు!