JEE Main Answer Key: జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) షాకిచ్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్ 17న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జేఈఈ మెయిన్ తుది విడత పేపర్-1 ఫైనల్ కీను వెల్లడించిన ఎన్‌టీఏ.. ఆ తర్వాత గంటలోనే ఎలాంటి కారణాలు చెప్పకుండానే దాన్ని అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. దీంతో ఏప్రిల్ 17న ర్యాంకులు విడుదల చేస్తామని చెప్పిన ఎన్‌టీఏ విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి. 

Continues below advertisement


తుది కీపై అభ్యంతరాలే కారణమా?
జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-1లో 10 షిఫ్ట్‌ల(10 ప్రశ్నపత్రాలు)లో ప్రిలిమినరీ, ఫైనల్ కీ మధ్య 13 ప్రశ్నలకు జవాబులు మారాయి. అందులో 6 ప్రశ్నలను ఎన్టీఏ విరమించుకుంది. ఇక సెషన్-2 పరీక్షల్లో 10 షిఫ్ట్‌ల్లో 12 ప్రశ్నలకు జవాబులు మారాయి. అందులో ఒక ప్రశ్నను విరమించుకుంది. అయితే ఫైనల్ కీపై పలువురు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఈమెయిల్స్ పంపించారు. దీంతో ఎన్‌టీఏ తుది కీ పెట్టిన గంటలోనే తొలగించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెబ్‌సైట్‌లో ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరో వైపు ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించే మొదటి 2.5 లక్షల మంది విద్యా్ర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావడానికి ఇంకా 5 రోజుల సమయం ఉండటంతో.. ఈలోగా ఎన్టీఏ జేఈఈ మెయిన్స్ ర్యాంకులు ప్రకటిస్తుందా? లేదా? అన్న సందిగ్ధత విద్యార్థుల్లో నెలకొంది.


జేఈఈ మెయిన్ సెషన్‌-1 ఫలితాలు ఫిబ్రవరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక సెషన్‌-2 ఫలితాలు ఏప్రిల్ 17న విడుదల కావాల్సి ఉండగా..  వెల్లడికాలేదు. జేఈఈ మెయిన్ పరీక్షల్లో రెండు విడతల్లో విద్యార్థులు కనబరచిని ప్రతిభ ఆధారంగా ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను ఎన్టీఏ కేటాయించనుంది. కేటగిరీల వారీగా కటాఫ్‌ స్కోర్‌ను నిర్ణయించి సెషన్‌ 1, 2లో అర్హత సాధించిన మొత్తం 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు ప్రకటించనుంది. వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 18న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-2 నిర్వహించనున్నారు.


మే 2 వరకు దరఖాస్తులకు అవకాశం..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 


జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.04.2025.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.05.2025.


➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.05.2025.


➥ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్: 11.05.2025 నుంచి 18.05.2025 వరకు


➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షతేది: 18.05.2025.


➥ విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు: 22.05.2025.


➥ ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల: 26.05.2025.


➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 26.05.2025 - 27.05.2025.


➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల వెల్లడి: 02.06..2025. 


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తు ప్రారంభం: 02.06..2025. 


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తుకు చివరితేదీ: 03.06..2025. 


➥ జాయింట్ సీట్ అలోకేషన్ (JoSAA) కౌన్సెలింగ్ ప్రారంభం: 03.06..2025. 


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) పరీక్ష తేదీ: 05.06..2025. 


➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) ఫలితాల వెల్లడి: 08.06..2025.