NTA JEE MAIN 2025 SESSION-2 SCHEDULE: జేఈఈ మెయిన్-2025 సెషన్-2 పరీక్షల షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మార్చి 10న ప్రకటించింది. దీనిప్రకారం ఏప్రిల్ 2 నుంచి 9 మధ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్ష, ఏప్రిల్ 9న పేపర్-2 (బీఆర్క్/బీప్లానింగ్) పరీక్ష నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టులో, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నారు.
విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. అడ్మిట్ కార్డులను పరీక్షలకు పరీక్షకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఏప్రిల్ 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.
జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో మార్పులు..
జాతీయ స్థాయి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు.. జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ 2025 పరీక్షలో ఆప్షనల్ ప్రశ్నలను సెషన్-1లో నిలిపివేశారు. సెషన్-2లోనూ ఇదే విధానాన్ని పాటించనున్నారు. కోవిడ్-19 కాలంలో ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే రాబోయే జేఈఈ మెయిన్ పరీక్షలో పేపర్‌లోని సెక్షన్-బిలో 10కి బదులుగా 5 ప్రశ్నలు మాత్రమే ఉండనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఆప్షనల్ లేకుండా మొత్తం 5 ప్రశ్నలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం..
➥పేపర్-1(బీటెక్, బీఈ) పరీక్ష
బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్-25 మార్కులు, ఫిజిక్స్-25 మార్కులు, కెమిస్ట్రీ-25 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టును రెండు విభాగాలు(సెక్షన్-ఎ, సెక్షన్-బి)గా విభజించారు. ఒక్కో సబ్జెక్టులో సెక్షన్-ఎ 20 మార్కులు, సెక్షన్-బి 5 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-ఎలో పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూలతో) రూపంలో ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-బిలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత రూపంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు.
➥ పేపర్-2(ఎ) బీఆర్క్ పరీక్ష
నిట్‌లు,ట్రిపుల్ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొత్తం 77 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 02 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-2(బి)బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ పరీక్ష..
బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 25 మార్కులు ఉంటాయి.
జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 13,11,544 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 12,58,136 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 11న విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌తో రాణించారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 10వ ర్యాంకులో, తెలంగాణకు చెందిన బాని బ్రత మాజీ 12వ ర్యాంకులో నిలిచారు.