NEET UG 2024 Cutoff Marks: నీట్ యూజీ 2024 పరీక్షను మొత్తం 720 మార్కులకు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలతోపాటు కటాఫ్ మార్కుల వివరాలను NTA వెల్లడించింది. దీనిప్రకారం జనరల్ విభాగం విద్యార్థులకు కటాఫ్‌ను 164 మార్కులుగా నిర్ణయించింది. అంటే 164 మార్కులు వస్తేనే.. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో చేరడానికి అర్హత పొందుతారు. ఇక బీసీ, ఎస్‌సీ, ఎస్టీలకు 129 మార్కులుగా; ఈడబ్ల్యూఎస్‌కు 146 మార్కులుగా కటాఫ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. ఫలితాలకు సంబంధించి పరీక్షకు 24,06,079 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 23,33,297 మంది విద్యార్థులకు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైనవారిలో 13,16,268 మంది అర్హత సాధించారు.
నీట్ యూజీ 2024 ఫలితాలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకంగా 66 మందికి 1వ ర్యాంకు..
ఫలితాల్లో టాప్-100 ర్యాంకుల్లో మొత్తం 66 మంది విద్యార్థులు 99.997129 పర్సంటైల్‌తో 1వ ర్యాంకులో నిలిచారు. ఇందులో ఏపీకి చెందిన కస్తూరి సందీప్ (21వ స్థానం), గట్టు భానుతేజ సాయి (28వ స్థానం), పోరెడ్డి పవన్ కుమార్ రెడ్డి (56వ స్థానం), వడ్లపూడి ముఖేశ్ చౌదరి (60వ స్థానం) 1వ ర్యాంకులతో సత్తాచాటారు. ఇక తెలంగాణకు చెందిన అనురన్ ఘోష్ 99.996614 పర్సంటైల్‌తో 77 ర్యాంకు సాధించాడు. మొత్తంగా చూస్తే టాప్-100 లో 5 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఎస్టీ కేటగిరీలో తెలంగాణకు చెందిన గుగులోతు వెంకట నృపేష్ 167వ ర్యాంకు, లావుడ్య శ్రీరామ్ నాయక్ 453వ ర్యాంకు సాధించి జాతీయస్థాయిలో తొలి రెండు స్థానాలు సాధించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉత్తీర్ణత..
⫸ నీట్ యూజీ 2024 పరీక్షలో ఉత్తీర్ణత గతేడాదితో పోల్చితే ఈసారి పెరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీట్ యూజీ పరీక్ష కోసం ఏపీ నుంచి 66,522 మంది దరఖాస్తు చేసుకోగా.. 64,931 మంది (62.46 శాతం) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 43,858 మంది (67.54 శాతం) విద్యార్థులు అర్హత సాధించారు. ఏపీలో గతేడాది 68578 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 42,836 మంది (62.46 శాతం) అర్హత సాధించారు.
⫸ ఇక తెలంగాణ నుంచి 79,813 మంది దరఖాస్తు చేసుకోగా.. 77,849 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 47,371 మంది (60.84 శాతం) విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణలో గతేడాది 72,842 మంది పరీక్ష రాయగా.. 42,654 మంది(58.55 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జాతీయ సగటు ఉత్తీర్ణత 56.41 శాతం ఉంది. అంటే రాష్ట్ర విద్యార్థులు దాదాపు నాలుగున్నర శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్షను మే 5న నిర్వహించిన సంగతి తెలిసిందే. పెన్ను, పేపర్ విధానంలో జరిగే పరీక్ష నిర్వహించారు. తెలుగుతో పాటు 13 బాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరైన సంగతి తెలిసిందే. నీట్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా మొత్తం 24,06,079 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10.29 లక్షల బాలురు ఉన్నారు. వీరిలో 9,98,298 లక్షల మంది పరీక్షకు హాజరుకాగా.. 5.47 లక్షల మంది అర్హత సాధించారు. ఇక 13.76 లక్షల బాలికలు దరఖాస్తు చేసుకోగా.. 13.34 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 7.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలో అర్హత సాధించారు.