నీట్‌  పీజీ 2022( NEET-PG 2022) వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఓ ప్రకటన విడుదల చేసింది. అలాంటి ఫేక్‌ ప్రచారాన్ని నమ్మొద్దని అభ్యర్థులకు హెచ్చరించింది. శనివారం సాయంత్రం ఈ మేరకు హెచ్చరిక నోటీసు జారీ చేసింది. 


నీట్ పీజీ 2022 పరీక్షను జూలై 9కి వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఫేక్‌ ప్రచారమని... NEET PG పరీక్ష 2022 షెడ్యూల్ ప్రకారమే 21 మేన నిర్వహిస్తామని ఎలాంటి మార్పులు లేవని NBEMS తెలిపింది. 


Also Read: మెడికల్ స్టూడెంట్స్‌కు అలర్ట్ - నీట్ ఎండీఎస్ 2022 అడ్మిట్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి


ఎలాంటి సమాచారమైనా NBEMS అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రకటిస్తామని వేరే ప్లాట్‌ఫామ్స్‌పై ప్రకటనలు ఉండబోవని తెలిపింది. NBEMSకి సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలని అభ్యర్థులకు సూచించబడింది.


"కొందరు వ్యక్తులు అభ్యర్థులను కావాలనే తప్పుదారి పట్టించేందుకు NBEMS పేరుతో ఫేక్ నోటీసులు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారని NBEMS తెలిపింది. జూలై 2020 నుంచి జారీ చేసిన అన్ని NBEMS నోటీసులకు QR కోడ్‌ కలిగి ఉంటుంది. QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నిజమైన సమాచారం అభ్యర్థులకు తెలుస్తుందని.. ఫేక్ ప్రచారం నుంచి విముక్తి లభిస్తుందని అభిప్రాయపడింది NBEMS. ఈమేరకు వెబ్‌సైట్‌లో ఓ నోటీసు పెట్టింది. 


NBEMS ధృవీకరించని సమాచారాన్ని చూసి మోసపోవద్దని సూచించింది. అలాంటి సమాచారం మీ దృష్టికి వస్తే కచ్చితంగా NBEMSకి వెబ్‌సైట్ ద్వారా క్రాస్ వెరిఫై చేయమని కూడా అభ్యర్థులను కోరుతోంది.