NEET frisking row: మెడికల్ నీట్ పరీక్షల విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షకు హాజరైన సమయంలో లో దుస్తులు తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేసిన విద్యార్థినులకు గుడ్ న్యస్ చెప్పింది. తమ లో దుస్తులు తొలగించారని ఆరోపించిన విద్యార్థినుల కోసం నీట్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ఎన్‌టిఎ తెలిపింది. సెప్టెంబర్ 4న ఆ విద్యార్థులకు అవకాశం ఇస్తున్నామని, ఇదే విషయాన్ని సదరు యువతులకు మెయిల్ ద్వారా తెలియజేసింది.
కేరళలో సంచలనం సృష్టించిన నీట్ పరీక్షలో నిర్వాహకుల అత్యుత్సాహం
కేరళలోని కొల్లాం జిల్లాలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి ముందు తమ లో దుస్తులు తొలగించాలని అక్కడి సిబ్బంది అడగటంపై తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై జులైలో ఓ వ్యక్తి కొట్టారకర పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాత మంగళంలోని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు తన కుమార్తెతో సహా పలువురు విద్యార్థినుల లో దుస్తులు తొలగించమని కోరినట్లు పేర్కొన్నారు. దీనిపై సెక్షన్ 354, 509 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఏడుగుర్ని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఇద్దరు కళాశాల సిబ్బందితో పాటు అక్కడి భద్రతను అప్పగించిన ఏజెన్సీకి చెందిన ముగ్గురు ఉన్నారు. తర్వాత వీరు బెయిల్‌పై విడుదలయ్యారు. జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంపై సీరియస్‌గా స్పందించింది.
విచారణ జరిపి నిజమేనని తేల్చుకుని ఎన్టీఏ కమిటీ - రీ ఎగ్జామ్ పెట్టాలని నిర్ణయం
ఈ విషయం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వరకు వెళ్లింది. ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని వేసి విచారణ చేపట్టింది. అంతేకాకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. బాధిత విద్యార్థినులకు సెప్టెంబర్ 4న తిరిగి నీట్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.
సెప్టెంబర్ ఏడో తేదీన నీట్ యూజీ ఫలితాలు విడుదల చేస్తామన్న ఎన్టీఏ !
నీట్ యూజీ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక అప్‌డేట్ వెల్లడించింది. నీట్ యూజీ ఫలితాలను సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు 30 నాటికి neet.nta.nic.in వెబ్‌సైట్‌లో ఆన్సర్ ‘కీ’తో పాటు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ స్కాన్డ్ ఇమేజెస్, రికార్డెడ్ రెస్పాన్స్‌లను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.