జాతీయ స్థాయి మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-2022 ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. జులై 17న దేశవ్యాప్తంగా దాదాపు 3,570 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి నీట్ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు రిజిష్టర్ చేసుకోగా.. 17.78 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రికార్డు స్థాయిలో 95 శాతం హాజరు నమోదైంది. నీట్-2022 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ఆగస్టు 17 లేదా 18న వెలువడే అవకాశం ఉంది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల ఆన్సర్ షీట్లను కూడా విడుదల చేయనున్నారు. అభ్యర్థుల ఓఎంఆర్ ఆన్సర్ కీ స్కాన్ కాపీలను అభ్యర్థుల ఈమెయిల్ ఐడీలకు పంపుతారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 


ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలిపే అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ.200గా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తెలిపిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ పరిశీలిస్తుంది. ఒకవేళ అభ్యర్థుల వాదన సరైనది అనిపిస్తే.. ఆన్సర్‌ కీలో మార్పులు చేస్తుంది. ఆ తర్వాత నిపుణులు ఖరారు చేసిన ఫైనల్ కీని విడుదల చేస్తుంది. ఫైనల్ కీ ఆధారంగానే తుది ఫలితాలను ప్రకటిస్తారు. ప్రస్తుతానికి నీట్ ఫలితాల తేదీని ఎన్టీఏ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ నెఖాలరులోపు ఫలితాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఆన్సర్ కీ కోసం వెబ్‌సైట్: https://neet.nta.nic.in

సాధారణంగా నీట్ ఫలితాలను పరీక్ష జరిగిన నెలన్నరలోపు ఎన్టీఏ విడుదల చేస్తుంటుంది. గతేడాది నీట్ పరీక్ష సెప్టెంబర్ 12న జరగ్గా, ఫలితాలు నవంబర్ 1న విడుదలయ్యాయి. 2020లో సెప్టెంబర్ 13న నీట్ జరగ్గా, అక్టోబర్ 16న ఫలితాలు వెలువడ్డాయి. దీనిప్రకారం జులై 17న నీట్ పరీక్ష జరగ్గా.. ఆగస్టు 31లోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 


కటాఫ్ మార్కులు ఇలా..?
నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సెంట్‌గా.. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. గతేడాది కటాఫ్‌ మార్కులు జనరల్‌-138, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 108గా నిర్ణయించారు. ఈసారి అర్హత మార్కులు 5-10 మార్కులు తగ్గే అవకాశం ఉంది. కటాఫ్‌ మార్కు 125-130 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఫలితాల వెల్లడి తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రకటించనుంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెబ్‌సైట్‌లో కౌన్సెలింగ్ షెడ్యూలును అప్‌లోడ్ చేయనుంది. 

నీట్‌ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను 'మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్' ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. 

టై బ్రేకింగ్ ప్రకారమే ర్యాంకులు..

ఈ సారి ర్యాంకింగ్ విధానంలో టై బ్రేకింగ్ విధానాన్ని అమలుచేయనున్నారు. దీనిప్రకారం..

▶ బయాలజీ (బోటనీ & జువాలజీ), కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు/పర్సెంటైల్ స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటంది. 

▶ అన్ని సబ్జెక్టులలో మార్కులు ఒకేలా ఉంటే, తక్కువ ప్రశ్నలకు ప్రయత్నించిన విద్యార్థులకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది, తరువాత బయాలజీ, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్‌లలో తక్కువ తప్పులు చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.

▶ ఈ మార్కులన్నీ కూడా సరిపోలితే, వయసులో ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ర్యాంక్ ఇవ్వబడుతుంది.

▶ ఒకవేళ అభ్యర్థులు తమ పుట్టినరోజును పరిగణనలోకి తీసుకుంటే, ముందుగా నీట్ పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థికి ఎక్కువ ర్యాంకు లభిస్తుంది. 


 


Also Read:

NTRUHS PG Admissions: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌, చివరితేది ఇదే!
ఏపీలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో కాంపిటెంట్ కోటా కింద పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో పీజీ మెడికల్, పీజీ డెంటల్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 23న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఈ కోర్సులకు ఎంబీబీఎస్/బీడీఎస్ డిగ్రీ అర్హతతోపాటు నీట్-పీజీ 2022/ నీట్ ఎండీఎస్ 2022 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పీజీ మెడికల్ కోర్సులకు 31.05.2022 నాటికి, పీజీ డెంటల్ కోర్సులకు 31.03.2022 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తు ఫీజుగా అభ్యర్థులు రూ.7,080 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,900 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


 
CLAT 2023: కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023, దరఖాస్తు చేసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్) - 2023' ప్రవేశ ప్రక‌ట‌న విడుదలైంది. దీనిద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతోపాటు, ఏడాది కాలపరిమితి ఉండే పీజీ (ఎల్‌ఎల్‌ఎం) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డిగ్రీ కోర్సుకు ఇంటర్, పీజీ కోర్సులో ప్రవేశానికి లా డిగ్రీతో ఉత్తీర్ణత ఉండాలి. క్లాట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఆగస్టు 8 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 18న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహిస్తారు.
కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023 వివరాల కోసం క్లిక్ చేయండి


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..