దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ఆగస్టు 17తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. వాస్తవానికి ఆగస్టు 10తో ముగియాల్సిన గడువును ఆగస్టు 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.


నవోదయ విద్యాలయ సమితి పరిధిలోని మొత్తం 649 జేఎన్‌వీల్లో దాదాపు 48 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. జేఎన్‌వీ ప్రవేశ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌‌తోపాటు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.


ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. మొత్తం సీట్లలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు ఉంటాయి.


వివరాలు..


* జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష - 2024


సీట్ల సంఖ్య: దాదాపు 48 వేలు.


అర్హతలు..


➥ 2023-2024 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్నవారు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్టు (జేఎన్‌వీఎస్‌టీ) రాయడానికి అర్హులు. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. విద్యార్థులు తప్పనిసరిగా సంబంధిత నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాలో నివాసి అయి ఉండాలి.


➥ ప్రవేశాల్లో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులతో భర్తీ చేస్తారు. గ్రామీణ ప్రాంత కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో లేదా గుర్తింపు పొందిన ఇతర స్కూళ్లలో చదవి ఉండాలి. మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలవారికి అవకాశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం సీట్లు ఉంటాయి. దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు.


వయోపరిమితి: విద్యార్థులు 01.05.2012 - 31.07.2014 మధ్య జన్మించి ఉండాలి.,


 ఉచిత విద్య, వసతి..
ఈ పరీక్షలో ఎంపికైనవారికి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచితంగా చదువుతోపాటు వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయి. ఎనిమిదో తరగతి వరకు మాతృ భాష లేదా ప్రాంతీయ భాషలో విద్య అభ్యసించవచ్చు. 9వ తగరతి నుంచి ఇంగ్లిష్ మీడియం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. ఇక్కడ రెగ్యులర్‌ చదువతోపాటు నీట్‌, జేఈఈ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయొచ్చు పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్‌ మార్కులు లేవు.


➥ సెక్షన్‌-1లో మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్ (MAT) నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 50 మార్కులు ఉంటాయి. దీనికి ఒక గంట సమయం కేటాయించారు. ఈ సెక్షన్‌లో మొత్తం 10 విభాగాలుంటాయి. ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు అడుగుతారు. 


➥ సెక్షన్‌-2లో అరిథ్‌మెటిక్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల్లో ఈ సెక్షన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. 


➥ సెక్షన్‌-3 అనేది లాంగ్వేజ్‌ టెస్ట్‌. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. లాంగ్వేజ్‌ టెస్టులో పాసేజ్‌ ఇచ్చి, ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. విద్యార్థులు పాసేజ్‌ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాసేజ్‌ కింద అయిదేసి ప్రశ్నల చొప్పున నాలుగు పాసేజ్‌లు ఉంటాయి.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19.06.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.08.2023


➥ ప్రవేశ పరీక్షతేది: 20.01.2024 (ఏపీ, తెలంగాణ) , 04.11..2023. 


Notification


Online registration


Website


                                


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..