JEE Main 2025 City Intimation Slip: జేఈఈ మెయిన్-2025 రెండో విడత పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)' మార్చి 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 2,3,4,7,8 తేదీల్లో రెండు షిఫ్టుల్లో పేపర్-1 (బీఈ, బీటెక్‌) పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా.. ఏప్రిల్ 9న పేపర్‌-2ఎ (బీఆర్క్‌), పేపర్‌-2బి (బి ప్లానింగ్‌), పేపర్‌-2ఎ, 2బి (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ రెండింటికి) పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో మొదటి షిఫ్ట్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. సెకండ్‌ షిఫ్ట్‌ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. దేశవ్యాప్తంగా 15 నగరాల్లో జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షకు మూడునాలుగు రోజుల ముందునుంచి అడ్మిట్‌కార్డులను ఎన్టీఏ విడుదల చేయనుంది.


JEE Main 2025 సెషన్-2 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ డౌన్‌లోడ్ ఇలా..


సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి - jeemain.nta.nic.in 


➥ హోంపేజీలో జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ 2025 సెషన్‌-2కు సంబంధించి లింక్‌పై క్లిక్ చేయాలి.


➥ మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.


➥ జేఈఈ మెయిన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ స్క్రీన్‌పై కనబడుతుంది.


➥ ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్ తీసుకుని పెట్టుకోవాలి.


➥ కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి.


JEE Main 2025 City Intimation Slip Download






పరీక్ష విధానం..


➥పేపర్‌-1(బీటెక్, బీఈ) పరీక్ష
బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్-25 మార్కులు, ఫిజిక్స్-25 మార్కులు, కెమిస్ట్రీ-25 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టును రెండు విభాగాలు(సెక్షన్-ఎ, సెక్షన్-బి)గా విభజించారు. ఒక్కో సబ్జెక్టులో సెక్షన్‌-ఎ 20 మార్కులు, సెక్షన్‌-బి 5 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-ఎలో పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో  బహుళైచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూలతో) రూపంలో ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-బిలో న్యూమరికల్‌ వాల్యూ ఆధారిత రూపంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు. 


➥ పేపర్‌-2(ఎ) బీఆర్క్‌ పరీక్ష
నిట్‌లు,ట్రిపుల్‌ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్‌-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొత్తం 77 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 02 మార్కులు ఉంటాయి. 


➥ పేపర్‌-2(బి)బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ పరీక్ష..
బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్‌-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 25 మార్కులు ఉంటాయి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...