SSC Pre Final Exams 2025: తెలంగాణలో పదోతరగతి విద్యార్థులకు మార్చి 6 నుంచి ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ప్రీఫైనల్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఓఎంఆర్ పత్రాలను ఇవ్వనున్నారు. పదోతరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులకు ఓఎంఆర్ పత్రాలు ఇవ్వనున్న నేపథ్యంలో.. ఇందుకు సంబంధించి ఓంఎంఆర్‌లో వివరాలను నింపడంపై అవగాహన కల్పించేందుకు ప్రీ ఫైనల్ పరీక్షల్లో నమూనా ఓఎంఆర్ పత్రాలను విద్యాశాఖ ఇవ్వనుంది.
నమూనా OMR పత్రాలు ఎందుకంటే?
రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే అన్నిరోజులూ విద్యార్థులకు ఓఎంఆర్ పత్రాలను ఇస్తారు. విద్యార్థులకు నేరుగా తుది పరీక్షల్లో పత్రాలను ఇవ్వడం వల్ల వారు అయోమయానికి గురై తప్పులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యలో దీన్ని నివారించేందుకే ప్రీ ఫైనల్‌లో పరీక్షల్లోనే నమూనా ఓఎంఆర్ పత్రాలను ఇస్తున్నారు. దానివల్ల కొంత సాధన చేసినట్లవుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెంటర్ కోడ్ ఉండదు..
పరీక్ష కేంద్రం ఎక్కడన్నది ముందుగా వెల్లడించకూడదని భావించి.. ఈ పత్రంలో సెంటర్ కోడ్ బదులు విద్యార్థి చదువుతున్న పాఠశాల వివరాలు.. విద్యార్థి వివరాలు ముద్రిస్తున్నారు. ఆ వివరాల్లో తప్పులుంటే సంబంధిత ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకెళితే నామినల్ రోల్స్‌లో సవరిస్తారని ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు తెలిపారు.
మార్చి 21 నుంచి పబ్లిక్ పరీక్షలు..
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వాటిని అందించనున్నారు. అవగాహన కోసమే అయినందున కేవలం ఆంగ్లం, గణితం సబ్జెక్టు పరీక్షలకు మాత్రమే వాటిని ఇస్తారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి 1న జిల్లాల వారీగా నమూనా ఓఎంఆర్ పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సుమారు 5 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నందున.. రెండు సబ్జెక్టులకు 10 లక్షల పత్రాలను పంపిస్తున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.
ప్రీఫైనల్ పరీక్షల షెడ్యూలు..
➥ మార్చి 6: ఫస్ట్ లాంగ్వేజ్ (First Language)
➥ మార్చి 7: సెకండ్ లాంగ్వేజ్ (Secons Language)
➥ మార్చి 10: ఇంగ్లిష్ (English)
➥ మార్చి 11: గణితం (Mathematics)
➥ మార్చి 12: భౌతిక శాస్త్రం (Physical Science)
➥ మార్చి 13: జీవ శాస్త్రం (Biological Science)
➥ మార్చి 15: సోషల్ స్టడీస్ (Social Studies)
పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..
➥ మార్చి 21: ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)
➥ మార్చి 22న సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)
➥ మార్చి 24న ఇంగ్లిష్
➥ మార్చి 26న మ్యాథమెటిక్స్
➥ మార్చి 28న ఫిజికల్ సైన్స్
➥ మార్చి 29న బయోలాజికల్ సైన్స్
➥ ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్.
➥ ఏప్రిల్ 3న ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(OSSC) విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్), ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు థియరీ పరీక్ష.
➥ ఏప్రిల్ 4న ఓరియంటెల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్(OSSC) విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్).
ALSO READ:
ఏపీలో పదోతరగతి పరీక్షలు ఎప్పటినుంచంటే?
ఏపీ ప్రభుత్వం పదోతరగతి పరీక్షల షెడ్యూలును ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..