Study in France: భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ ఏడాది ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత విద్యార్థులకు ఆయన శుభవార్త వినిపించారు. మరింత మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునే వీలుగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వచ్చే ఆరేళ్లల్లో (2030 నాటికి) దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్‌కు ఆహ్వానించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. భారత విద్యార్థులకు ఫ్రాన్స్ ఏవిధంగా తోడ్పాటునందించనుందో మెక్రాన్ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా అంతర్జాతీయ తరగతుల‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక నెట్‌వర్క్‌ను సృష్టిస్తామని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని మెక్రాన్ వెల్లడించారు.


కెనడాకు చెక్..
విదేశీ విద్యార్థులకు కొత్తగా ఇవ్వబోయే స్టడీ పర్మిట్లపై కెనడా ప్రభుత్వం రెండేళ్ల పాటు పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇస్తున్న వాటిలో మూడో వంతు పర్మిట్లపై కోత పెట్టనుంది. దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దశాబ్దం క్రితంతో పోలిస్తే దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య మూడింతలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పరిమితి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది 3.64 లక్షల మంది విద్యార్థులకు పర్మిట్లు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇచ్చిన పర్మిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. మాస్టర్స్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ విద్యార్థులకు తాజా పరిమితులు వర్తించవు. 


భారత్‌-కెనడా మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలు.. భారత విద్యార్థులపై గణనీయంగా ప్రభావం చూపాయి. ఆ దేశానికి వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు వెనుకాడుతున్నారు. కెనడా కాకుండా ఇతర దేశాల్లో ఉన్నత విద్య చదవటంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కెనడాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య 2023లో 86 శాతం వరకు పడిపోయింది. ఏటా కెనడా జారీచేసే స్టూడెంట్‌ వీసాల్లో అత్యధిక వాటా భారతీయ విద్యార్థులదే 2022లో 2,25,835 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. అందులో 41 శాతం భారతీయ విద్యార్థులే సొంతం చేసుకున్నారు. అక్కడి విశ్వవిద్యాలయాలకు విదేశీ విద్యార్థులే ప్రధాన ఆదాయ వనరు.


వర్క్ పర్మిట్లలోనూ మార్పులు..
పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లకు (PGWP) సంబంధించిన అర్హతల్లోనూ కెనడా ప్రభుత్వం మార్పులు చేసింది. 2024 సెప్టెంబర్ నుంచి కరికులం లైసెన్సింగ్ అరేంజ్‌మెంట్స్ కింద నమోదు చేసుకున్న విద్యార్థులకు వర్క్ పర్మిట్ ఇవ్వబోమని తెలిపింది. మరోవైపు మాస్టర్స్ ప్రోగ్రామ్ కింద నమోదైన గ్రాడ్యుయేట్లు మూడేళ్ల వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించడం గమనార్హం. కెనడాలో విద్యనభ్యసించడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉన్నారు.


ప్రత్యామ్నాయంగా ఫ్రాన్స్..
కెనడాకు వలస వెళ్లే విదేశీ విద్యార్థుల్లో  తీరుతో అసంతృప్తిగా ఉన్న భారత్  ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారించింది. కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులను ఫ్రాన్స్ వైపు మళ్లీంచేందుకు చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య బలమైన దౌత్య సంబంధాలు నెలకొన్నాయి. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ప్రకటన భారతీయ విద్యార్థులకు మేలు చేస్తుందనే చెప్పాలి.   


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...