JNTUH Grace Marks: జేఎన్‌టీయూ పరిధిలో 2022-23 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపుతూ జేఎన్‌టీయూ యూనివర్సిటీ (JNTU) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు డిసెంబరు 18 ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు 30 మార్కులు, డిప్లొమా పూర్తిచేసిన ఇంజినీరింగ్ విద్యార్థులకు 23 మార్కులు కలుపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.
కరోనా సమయంలో విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపామని, ఈసారి విద్యార్థులు కోరడంతో ఇంజినీరింగ్‌లోని అన్ని విభాగాల డీన్‌లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దీంతో సుమారు 4వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ అధికారుల నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థులు ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇంజినీరింగ్ కాలేజీల ఎదురీత..
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గడచిన పదేళ్ల కాలంలో కళాశాలల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2015 నాటికి రాష్ట్రంలో 234 ఇంజినీరింగ్ కాలేజీలుంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 159కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండే కాలేజీలే ఎక్కువగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 48 కాలేజీలుంటే, ఇప్పుడు వాటి సంఖ్య 11కు తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే, ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 11కుగాను ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయి. ఇలా ప్రతీ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఆఖరుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 2015లో 74 కాలేజీలుంటే, 20 కాలేజీలు మాయమై 54 మిగిలాయి. ఇటీవల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని ఉన్నత విద్యామండలి అధికారులు అంటున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని 80 శాతం కాలేజీల నాణ్యత పెంచాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) రాష్ట్రానికి సూచించింది. న్యాక్ అక్రిడిటేషన్ పరిధిలోకి వస్తేనే అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ తరహా పోటీని తట్టుకునే ప్రైవేటు కాలేజీలు 20కి మించి లేవు. ఇంజనీరింగ్ విద్యలోనూ మార్పులు వస్తున్నాయి. బోధన ప్రణాళికను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ భవిష్యత్‌లో మరికొన్ని కాలేజీలు మూతపడేందుకు కారణాలవుతాయని అంటున్నారు.
మరోవైపు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు కేంద్ర విద్యాశాఖ ఆహ్వానం పలుకుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీలోని ప్రధాన కాలేజీలు ఇక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులను ఆకట్టుకునేందుకు అవి ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతు న్నారు. ఈ పోటీని మన ఇంజనీరింగ్ కాలేజీలు తట్టుకునే అవకాశం తక్కువనే వాదన విన్పిస్తోంది.
ALSO READ:
విజ్ఞాన్ యూనివర్సిటీలో ప్రవేశాలు..
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వీశాట్-2024 (Vignan Scholastic Aptitude Test) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. నోటిఫికేషన్‌ను ఉపకులపతి పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్ అడ్మిషన్స్ కేవీ క్రిష్ణకిషోర్, డైరెక్టర్ గౌరీశంకరరావు నవంబరు 22న విడుదల చేశారు. ప్రవేశాలు కోరువారు ఆయా క్యాంపస్‌ల్లో దరఖాస్తులు పొందవచ్చు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. భారతీయ విద్యార్థులతో పాటు, విదేశాల్లో ఉంటున్న భారత సంతతి విద్యార్థులు కూడా ప్రవేశాలకు అర్హులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వీశాట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. విశాట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అదేవిధంగా ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ అందిస్తారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..