JEE Main Exam 2025: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2025 మొదటిదశ పరీక్షలు జనవరి 22 నుంచి ప్రారంభంకానున్నాయి. జేఈఈ మెయిన్ 2025 మొదటిదశ పరీక్షలకు సంబంధించిన రెండు పేపర్లు కలిపి 12 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష; జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంట నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో రెండు రాష్ట్రాల్లోని అన్ని నగరాలతోపాటు పలు పట్టణాల్లోనూ పరీక్షా కేంద్రాలను జాతీయ పరీక్షల సంస్థ(NTA) ఏర్పాటు చేసింది. వచ్చే ఏప్రిల్‌లో రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. రెండు దశల పరీక్షలో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది విద్యార్థులకు మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. 

జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులతో ఐఐటీల్లోనూ ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీల్లో గతేడాది సుమారు 24 వేల సీట్లు, ఇక 23 ఐఐటీల్లో 17,600 సీట్లు; ట్రిపుల్ ఐటీల్లో దాదాపు 8,500 సీట్లు; ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో 57 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కూడా అన్నే సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన ప్రతి 100 మంది విద్యార్థుల్లో సరాసరిన నలుగురికి మాత్రమే సీట్లు పొందుతున్నారు. 


విద్యార్థులకు ముఖ్య సూచనలు..


* విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనల్ని క్షుణ్ణంగా చదవాలి. 


* పరీక్ష సమయానికి 2 గంటల ముందుగానే తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలి. 


* అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికల్లా విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 


* పరీక్ష హాలు తెరవగానే విద్యార్థులకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. పరీక్ష రాసేందుకు సంసిద్ధంగా ఉండాలి. అవసరమైన అన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలి.


* ట్రాఫిక్ సమస్యల కారణంగా పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోనట్లైయితే.. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లు ఇచ్చే ముఖ్యమైన సూచనలను మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల ఆలస్యానికి ఎన్‌టీఏ ఎలాంటి బాధ్యత వహించదు.


* పరీక్ష హాలులో ఏదైనా టెక్నికల్ అసిస్టెన్స్/ఎమర్జెన్సీ, పరీక్షకు సంబంధించి ఇబ్బంది ఎదురైతే సెంటర్ సూపరింటెండెంట్/ఇన్విజిలేటర్‌ను సంప్రదించవచ్చు.


* అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు ప్రకారం ప్రశ్నపత్రం వచ్చిందో లేదో ముందుగా నిర్ధారించుకోవాలి. వేరే సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నపత్రం వస్తే వెంటనే సంబంధిత ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి.


* పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్ షీట్లను ఉపయోగించే కాలిక్యులేషన్సు/రైటింగ్ వర్కు చేసుకోవాలి. ఆ తర్వాత రఫ్ షీట్లను కచ్చితంగా ఇన్విజిలేటర్‌కు అందజేయాల్సి ఉంటుంది.


* కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు/సందేహాలు ఉంటే జేఈఈ(మెయిన్) వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.


* పరీక్షలకు ముందు రోజు కొత్త టాపిక్స్‌ను కవర్ చేసేందుకు ప్రయత్నించొద్దు. దానివల్ల విద్యార్థుల ఒత్తిడి, ఆందోళన స్థాయి పెరుగుతుంది.


* పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు ముందు రోజు తీసుకెళ్లాల్సిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. పరీక్షా కేంద్రాన్ని ముందుగానే తనిఖీ చేయండి. ఆ ప్రదేశం యొక్క పరిసరాలను తెలుసుకోవడం మంచిది.


* ఒక అభ్యర్థి తప్పుడు సమాచారంతో ఒకటి కంటే ఎక్కువ షిఫ్ట్/తేదీల్లో పరీక్షా కేంద్రంలో హాజరైతే, అతని/ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. వారి ఫలితాలు ప్రకటించబడవు.


* ఏ కారణం చేతనైనా నిర్ణీత పరీక్ష తేదీకి హాజరు కాలేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌టీఏ పరీక్షను తిరిగి నిర్వహించదు.


ALSO READ: జేఈఈ మెయిన్‌ 2025 సెషన్-1 అడ్మిట్‌కార్డులు విడుదల - పరీక్ష వివరాలు ఇవే!


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...