JEE Main Session 2 Application correction: జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత పరీక్షకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 25తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. విద్యార్థులు  ఫిబ్రవరి 27 నుంచి ఫిబ్రవరి 28 రాత్రి 11.50 వరకు తమ వివరాలు సవరించుకోవచ్చు. ఈ మేరకు ఎన్‌టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించి షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.


ఇవి మార్చేందుకు  ‘నో’ ఛాన్స్‌..


* జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేందుకు అవకాశం ఉండదు. ఒక్కసారి మాత్రమే వివరాలు సవరించుకునేందుకు అవకాశమిచ్చింది. కాబట్టి జాగ్రత్తగా వివరాలను సవరించుకోవాలని ఎన్టీఏ సూచించింది.


* ఆన్‌లైన్‌ దరఖాస్తులో అభ్యర్థి మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, అడ్రస్‌ (శాశ్వత/ప్రస్తుత), ఎమర్జెన్సీ కాంటాక్టు వివరాలు, అభ్యర్థి ఫొటోను మార్చడానికి అవకాశం ఉండదు.


* అభ్యర్థి పేరు/తండ్రి పేరు/తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే సవరించేందుకు అవకాశం ఉంటుంది.


* పదోతరగతి, ఇంటర్ సంబంధిత వివరాలు, పాన్‌ కార్డు నంబర్‌, పరీక్ష రాయాలనుకొనే నగరం, మాధ్యమాన్ని మార్చుకునేందుకు అవకాశం ఉంది. 


* అభ్యర్థి పుట్టినతేదీ, జెండర్‌, కేటగిరీ, సబ్‌ కేటగిరీ/పీడబ్ల్యూడీ, సంతకం మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. 


రెండు సెషన్ల విద్యార్థులూ వీటిని మార్చుకొనే ఛాన్స్‌..
జేఈఈ మెయిన్ సెషన్-1 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా తమ వివరాల్లో మార్పులు చేసుకునేందుకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. అభ్యర్థులు కోర్సు (పేపర్‌), ప్రశ్నపత్రం మాధ్యమం, స్టేట్‌ కోడ్‌ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఎగ్జామ్‌ సిటీ, పదో తరగతి, 12వ తరగతి సంబంధిత విద్యార్హత వివరాలు, జెండర్‌, కేటగిరీ వంటి వివరాలనుమాత్రమే మార్చుకొనేందుకు ఎన్‌టీఏ అవకాశం కల్పిస్తోంది. 


Public Notice


JEE(Main) 2025 Session 2 Application Edit


ఏప్రిల్‌ 1 నుంచి సెషన్-2 పరీక్షలు..
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్‌ 1 నుంచి 8 మధ్య సెషన్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు నిర్వహించనున్నారు. మార్చి మూడో వారంలో పరీక్ష కేంద్రాల వివరాలను ప్రకటించనున్నారు. అడ్మిట్‌ కార్డులను పరీక్షలకు పరీక్షకు మూడు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఏప్రిల్‌ 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. 


ఇటీవల వెల్లడించిన జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 13,11,544 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 12,58,136 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 11న విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌తో రాణించారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 10వ ర్యాంకులో, తెలంగాణకు చెందిన బాని బ్రత మాజీ 12వ ర్యాంకులో నిలిచారు. జేఈఈ (మెయిన్) పేపర్-2 (బీఆర్క్‌/బి ప్లానింగ్‌) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...