JEE Main 2024 City Intimation Slips: జేఈఈ మెయిన్ సెషన్-2  పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పులు జరిగాయి. జేఈఈ మెయిన్ పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు జరుగుతాయని ఎన్టీఏ పేర్కొంది. ఆ తర్వాత ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది. తాజాగా మరోసారి షెడ్యూలును సవరిస్తూ ప్రకటన విడుదల చేసింది.


అదేవిధంగా పరీక్షలకు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను అందుబాటులో ఉంచినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు, కోర్సు వివరాలు నమోదుచేసి సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిద్వారా అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఒకట్రెండు రోజుల్లో జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయనుంది. 


జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ కోసం క్లిక్ చేయండి..


తాజాగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్-2 (బీఈ/బీటెక్) పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండోసెషన్‌లో పరీక్ష నిర్వహిచనున్నారు. ఇక ఏప్రిల్ 12న పేపర్-2ఎ (బీఆర్క్), పేపర్-2బి (బీప్లానింగ్) లేదా పేపర్-2ఎ, 2బి రెండూ రాసే అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరోజు  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. 



పరీక్ష విధానం:


➥ జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. 


➥ ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.


➥ బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.


జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 


JEE (Main) - 2023 Notification


Eligibility Criteria


Official Website 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...