JEE Advanced 2026: దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తున్న లక్షల మంది విద్యార్థులకు కీలక సమాచారం అందింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026(JEE Advanced 2026) పరీక్షా షెడ్యూల్‌ను ఐఐటీ రూర్కీ అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రకటనతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు స్పష్టత రావడమే కాకుండా వారి ప్రిపరేషన్‌కు ఒక కచ్చితమైన లక్ష్యం ఏర్పడింది. మే 17, 2026న ఆదివారం ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఐఐటీ రూర్కీ స్పష్టం చేసింది.
ఐఐటీ కల- ఇక కార్యాచరణవైపు!
దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పేరుగాంచిన జేఈఈ అడ్వాన్స్‌డ్, ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఏకైక మార్గం. ఈ పరీక్షకు సంబంధించిన ప్రతి అంశం విద్యార్థి భవిష్యత్‌ను శాసిస్తుంది. ఐఐటీ రూర్కీ తన అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inలో పొందుపరిచిన వివరాల ప్రకారం ఈసారి పరీక్షా ప్రక్రియలో అడుగడుగునా కచ్చితత్వం, క్రమశిక్షణ అవసరమని స్పష్టమవుతోంది.
ముఖ్యమైన తేదీలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రక్రియ కేవలం పరీక్ష రోజుతో ముగిసేది కాదు. రిజిస్ట్రేషన్ నుంచి హాల్ టికెట్ డౌన్‌లోడ్ వరకు ప్రతి దశకు నిర్ధిష్ట గడువు ఉంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ;-జేఈఈ మెయిన్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు ఏప్రిల్ 23, 2026 ఉదయం పది గంటల నుంచి రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవతుుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 2, 2026 రాత్రి 11.59 వరకు సమయం ఇచ్చారు. గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తులు స్వీకరించబోమని ఐఐటీ రూర్కీ పేర్కొంది.
పరీక్ష ఫీజు చెల్లింపు:-దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే4,2026 రాత్రి 11.59లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి. ఈ గడువు దాటితే దరఖాస్తు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. కాబట్టి విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.
హాల్‌టికెట్‌లభ్యత:- పరీక్షకు వారం రోజుల ముందు, అంటే మే11,2026 ఉదయం పది గంటల నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. పరీక్ష జరిగే మే17వ తేదీ మధ్యాహ్నం 230 వరకు వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే సాంకేతిక ఇబ్బందులు కలగకుండా ముందే ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పరీక్ష సరళి
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలోనే జరుగుతుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని లోతుగా విశ్లేషించడానికి ఒకే రోజు రెండు పేపర్లు నిర్వహిస్తారు. పేపర్-1: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు
విద్యార్థులు ఈ రెండు పేపర్లకు హాజరవడం తప్పనిసరి కేవలం ఒక పేపర్‌కు మాత్రమే హాజరైన వారిని ర్యాంకింగ్‌కు పరిగణించరు. ప్రశ్నాపత్నాలు ఇంగ్లీష్, హిందీ భాషలలో అందుబాటులో ఉంటాయి.
అర్హత నిబంధనలు- టాప్ 2.5 లక్షల మందికే అవకాశం
జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి నేరుగా దరఖాస్తు చేయడం కుదరదు. దీని కంటే ముందు నేషనల్‌టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే జేఈఈ మెయిన్ 2026లో అసాధార ప్రతిభ కనబరచాలి.
జేఈఈ మెయిన్ షెడ్యూల్:
మొదటి సెషన్ : జనవరి 21 నుంచి జనవరి 30,2026 వరకు రెండో సెషన్: ఏప్రిల్ 1 నుంచి 10 వరకు
ఈ రెండు సెషన్లు స్కోర్ల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. అందులో టాప్ 2.5 లక్షల ర్యాంకుల్లో నిలిచిన వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ విద్యార్థులకు రెండు అవకాశాలు ఇస్తుంది. అందులో ఉత్తమ స్కోర్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
విదేశీ విద్యార్థులకు, OCI/PIO అభ్యర్థులకు ప్రత్యేక మార్గదర్శకాలు
భారత దేశం వెలుపల నివసిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, విదేశీ జాతీయుల కోసం నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. వీరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాధారణ అభ్యర్థుల కంటే ముందే, అంటే ఏప్రిల్ 6 నుంచి ప్రారంభమై మే 2, 2026 వరకు కొనసాగుతుంది. వీళ్లు కూడా మే 4వ తేదీ లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.