ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2023 నోటిఫికేషన్‌ గురువారం (డిసెంబరు 22) విడుదలైంది. గువాహటి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, నిట్‌లలో ప్రవేశం కల్పిస్తారు. బీటెక్, బీఎస్, బీఆర్క్, డ్యూయల్ డిగ్రీ (బీటెక్ + ఎంటెక్), డ్యూయల్ డిగ్రీ (బీఎస్ + ఎంఎస్), ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. జేఈఈ మెయిన్ 2023లో అర్హత సాధించిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు.


జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను వచ్చే ఏడాది జూన్‌ 4న నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్‌ 30 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.  విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 4 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 5 వరకు వెసులుబాటు కల్పించింది. మే 29 నుంచి జూన్ 4 వరకు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. విదేశాల్లో ఉన్న విద్యార్థులైతే ఏప్రిల్ 24 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 4న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ఈ పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండదని ఐఐటీ గువాహటి పేర్కొంది. 


వివరాలు..


* జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2023


అర్హత: మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్‌ ఉండాలి. కనీసం 75 శాతం మార్కులు వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 65 శాతం మార్కులు ఉండాలి. జేఈఈ మెయిన్-2023 పేపర్ - 1 రాసినవారే అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు ఎంపికచేస్తారు.


వయోపరిమితి: 1998 అక్టోబరు 1 తర్వాత జన్మించినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉంటుంది. అంటే 1993 అక్టోబరు 1 తర్వాత జన్మించినవారై ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.


ఫీజు వివరాలు...
పరీక్ష ఫీజుగా రూ.2900 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1450 చెల్లిస్తే సరిపోతుంది. విదేశీ విద్యార్థులు సార్క్ దేశాలకు చెందినవారైతే 90 యూఎస్ డాలర్లు, నాన్-సార్క్ దేశాలకు చెందినవారైతే 180 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.    


పరీక్ష విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి.


ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.04.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.05.2023.


➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.05.2023.


➥ విదేశీ విద్యార్థుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.04.2023.


➥ విదేశీ విద్యార్థుల దరఖాస్తుకు చివరితేది: 04.05.2023.


➥ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్: 29.05.2023 నుంచి 04.06.2023 వరకు 


➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షతేది: 04.06.2023.


JEE Advanced 2023 Notification


Information for foreign national candidates


Also Read:


జేఈఈ మెయిన్‌-2023 పరీక్షల షెడ్యూలు ఇలా!
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రెండు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపింది. ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.

జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది.

బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.
జేఈఈ మెయిన్ పరీక్ష విధానం, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..