తెలంగాణలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి పొడిగించింది. ఈమేరకు బుధవారం (జులై 27) ఉత్తర్వులు జారీచేసింది. జులై 31 వరకు ప్రవేశాలు పొందడానికి అవకాశం కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత రూ.500 ఆలస్యరుసుము వసూలుచేస్తూ ఆగస్టు 1 నుంచి 16 వరకు ప్రవేశాలు కల్పించవచ్చని బోర్డు తెలిపింది.


 ఇంటర్ బోర్డు తీసుకున్న ఆలస్యరుసుము నిర్ణయంపై పలు అధ్యాపక సంఘాల నేతలు మండిపడుతున్నారు. విద్యార్థుల నుంచి రూ.500 వసూలు చేయడమనేది చాలా దారుణమని ఆరోపిస్తున్నారు. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీల లిస్టును వెబ్‌సైట్‌లో పొందుపర్చనినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఏ కాలేజీకి గుర్తింపు ఉందో లేదో చూసుకొని తమ పిల్లలను ఇంటర్‌ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.


రాష్ట్రవ్యాప్తంగా 3,339 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఉండగా.. వీటిల్లో ఇప్పటి వరకు 3,27,202 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందారు. గతేడాది కాలేజీల సంఖ్య 3,107 మాత్రమేకాగా.. 4,98,699 మంది విద్యార్థులు చేరారు. దీనిని బట్టి దాదాపు 1.7 లక్షల మంది విద్యార్థులు ఇంకా చేరాల్సి ఉందని తెలుస్తోంది. వారంరోజుల క్రితం వరకూ ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నా, ప్రవేశాల­ను బోర్డుకు చూపించలేదు. అడ్మిషన్లు ముగిసే నాటికి ప్రవేశాలు చూపించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యద­ర్శి నవీన్‌ మిత్తల్‌ హెచ్చరించారు. దీంతో గత వారం లక్ష వరకూ ఉన్న అడ్మిషన్ల సంఖ్య ప్రస్తుతం 2 లక్షలు దాటింది. టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన తర్వా­త ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత పెరిగాయి. 


తెలంగాణ ఇంటర్ అకడమిక్​ ఇయర్ (​2023-24) క్యాలెండర్..


తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిప్రకారం రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమయ్యాయి.  ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది.  ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.


➥ జూనియర్ కాలేజీల పునఃప్రారంభం: 01.06.2023. 


➥ మొదటి, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ తరగతులు: 01.06.2023.


➥ దసరా సెలవులు: 19.10.2023 - 25.10.2023.


➥ దసరా సెలవుల తర్వాత పునఃప్రారంభం: 26.10.2023.


➥ అర్ధ సంవత్సర పరీక్షలు: 20.11.2023 - 25.11.2023.


➥ సంక్రాంతి సెలవులు: 13.01.2024 - 16.01.2024.


➥ సంక్రాంతి సెలవుల తర్వాత పునఃప్రారంభం: 17.01.2024.


➥ ప్రీ-ఫైనల్ పరీక్షలు: 22.01.2024 - 29.01.2024.


➥ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు: 2024 ఫిబ్రవరి రెండవ వారం నుండి.


➥  ఇంటర్ థియరీ పరీక్షలు: 2024 మార్చి మొదటి వారం నుండి.


➥ వేసవి సెలవులు: 01.04.2024 - 31.05.2024.


➥ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు:  2024 మే చివరి వారంలో


➥ 2024-25 విద్యా సంవత్సరానికి జూనియర్ కళాశాలల పునఃప్రారంభ తేదీ: 01.06.2024.



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..