దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మలై కేడియా టాపర్‌గా నిలిచాడు. అలాగే హైదరాబాద్ విద్యార్థి సింగారపు వెంకట్ కౌండిన్య మొదటి ర్యాంక్ సాధించాడు. 300/300 మార్కులు స్కోర్ సాధిచాడు. కౌండిన్య పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్‌లోని శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదివాడు. జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతానని కౌండిన్య తెలిపాడు.
జేఈఈ మెయిన్ ఫలితాలు, కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రెండో ర్యాంకులో లోహిత్...
జేఈఈ మెయిన్ ఫలితాల్లో నెల్లూరుకు చెందిన పి.లోహిత్ ఆదిత్యసాయి 2వ ర్యాంకు సాధించాడు. లోహిత్.. పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు నెల్లూరులోని నారాయణ విద్యా సంస్థల్లో చదివాడు. జూన్ 4న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతానని లోహిత్ తెలిపాడు. లోహిత్ కుటుంబం నెల్లూరులోని లక్ష్మీపురంలో నివాసముంటోంది. తండ్రి శ్రీనివాసరావు సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తల్లి వరలక్ష్మీ గృహిణి. ఇక హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి సాయి దుర్గారెడ్డి 6వ ర్యాంకు, అమలాపురానికి చెందిన కే.సాయినాథ్ శ్రీమంత 10వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.
ఆన్సర్ కీ సమయంలోనే కౌండిన్య, లోహిత్ 300/300 మార్కులు పొందిన సంగతి తెలిసిందే. మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశముందని నిపుణులు అంచనా వేయగా.. కౌండిన్య మొదటి ర్యాంకు, లోహిత్ 2వ ర్యాంకులో నిలిచారు.
30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్
జేఈఈ మెయిన్‌లో కనీస కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. వారు ఏప్రిల్ 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు మే 7వ తేదీ తుది గడువు. జూన్ 4వ తేదీన జరిగే పరీక్ష ఫలితాలను జూన్ 18వ తేదీన వెల్లడిస్తారు.
Also Read:
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో తప్పిన వారితోపాటు ఇంప్రూమెంట్ కోసం రాసే వారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్ధులకు, అదేరోజు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ఏపీ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈసారి ఎన్ని సెలవులంటే?
ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, అలాగే వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మార్చి 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్‌లో పేర్కొన్నారు.
ఇంటర్ పూర్తి క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..