Harish Rana Case:భారత న్యాయ చరిత్రలో కీలకమైన తీర్పు వచ్చింది. 13 ఏళ్లుగా అచేతన స్థితిలో, మంచానికే పరిమితమై నరకయాతన అనుభవిస్తున్న 32 ఏళ్ల హరీష్‌ రాణాకు కారుణ్య మరణం ప్రసాదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం వెల్లడించింది. హరీష్‌కు అమర్చిన లైఫ్‌ సపోర్ట్‌ తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. 2018 నాటి కామన్‌కాజ్‌ తీర్పు తర్వాత న్యాయస్థానం పర్యవేక్షణలో కారుణ్య మరణానికి అనుమతి లభించిన దేశంలో మొదటి కేసుగా ఇది నిలిచిపోనుంది.

Continues below advertisement

విషాదంలో ముగిసిన ఇంజనీరింగ్‌ కలలు

ఈ విషాద గాథ 2013 ఆగస్టు 20న ప్రారంభమైంది. చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్శిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్ రాణా, రాఖీ పండుగ వేళ తను ఉంటున్న నాల్గో అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీంతో మెదడు పని తీరు పూర్తిగా దెబ్బతిని అతను పర్మనెంట్‌ వెజిటేటివ్‌ స్టేట్‌ లోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అంటే దాదాపు 13 ఏళ్లుగా హరీష్‌ వంద శాతం పక్షవాతం(క్వాడ్రీప్లీజియా)తో, శ్వాస కోసం ట్రాకియోస్టమీ ట్యూబ్‌, ఆహారం కోసం గ్యాస్ట్రోస్టమీ ట్యూబ్‌లపై ఆధారపడి బతుకుతున్నాడు. ఈ క్రమంలోనే అతని శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. పరిస్థితి భయంకరంగా మారింది. 

కోర్టు గడప తొక్కిన వేళ 

హరీష్‌ పరిస్థితిని చూసి తట్టుకోలేక, అటు ఆర్థికంగా, ఇటు మానసిక వేదన భరించలేక అతని కుటుంబం గౌరవప్రదమైన మరణం కోసం న్యాయపోరాటం ప్రారంభించింది. హరీష్‌ తండ్రి, తల్లి, తమ్ముడు తమ ఇంటిని కూడా అమ్మి చికిత్స కోసం ఖర్చు చేశారు. 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఫీడింగ్‌ ట్యూబ్‌ తొలగించడం అనేది యాక్టివా యూతనేషియా కిందకు వస్తుందని, అది చట్టవిరుద్ధమని కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. 

Continues below advertisement

అయినప్పటికీ వెనక్కి తగ్గని కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రాథమికంగా కోర్టు పిటిషన్‌ను స్వీకరించకపోయినా ఖర్చులు ప్రభుత్వం భరించేలా ఆదేశించింది. అయితే 2025లో హరీష్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో AIIMS ద్వారా ఏర్పాటు చేసిన సెకండరీ మెడికల్ బోర్డు నివేదికను కోర్టు పరిగణలోకి తీసుకుంది. హరీష్‌ కోలుకునే అవకాశం ఏమాత్రం లేదని, ఫీడింగ్‌ ట్యూబ్ తొలగించడమే అతనికి మంచిదని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. 

పీవీఎస్‌, బ్రెయిన్ డెడ్ మధ్య తేడా ఏంటీ?

ఈ కేసు ద్వారా ఒక ముఖ్యమైన చట్టపరమైన చిక్కుముడి వీడింది. సాధారణంగా బ్రెయిన్ డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి అవయవ దానం చేయడానికి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. ఎందుకంటే వారు చట్టపరంగా మరణించినట్టే పరిగణిస్తారు. కానీ హరీష్‌ రాణా బ్రెయిన్‌ డెడ్‌ కాదు అతను పర్మనెంట్‌ వెజిటేటివ్‌ స్టేట్‌లో ఉన్నాడు. అంటే అతని మెదడులోని స్టెమ్ ఇంకా పని చేస్తోంది. దీని వల్ల అతను నిద్రపోవడం, మేల్కొనడం వంటివి చేస్తున్నాడు. చట్టపరంగా జీవించి ఉన్న వ్యక్తికి లైఫ్‌ సపోర్ట్ తొలగించాలంటే న్యాయస్థానం అనుమతి అవసరం. హరీష్‌ కేసులో సుప్రీం కోర్టు  ఈ క్లిష్టమైన అనుమతిని మంజూరు చేసింది. 

అందుకే ఈ కేసులో తీర్పు చెప్పే సమయంలో జస్టిస్‌ పార్దివాలా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. హరీష్‌ నివేదికలను చదవడానికి చాలా బాధాకరంగా ఉన్నాయని, అతన్ని ఇలానే వదిలేయలేమని కామెంట్ చేశారు. షేక్‌స్పియర్‌ ప్రసిద్ధ నాటకంలోని టుబి ఆర్‌ నాట్‌ టు బీ అనే వాక్యాన్ని ప్రస్తావిస్తూ, చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న హరీష్‌ స్థితిని ఆయన వివరించారు. 13 ఏళ్లుగా హరీష్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్న అతని కుటుంబం సభ్యుల ప్రేమానురాగాలను కోర్టు కొనియాడింది. 

తీర్పులోని కీలకాంశాలు

ఈ తీర్పులో ధర్మాసనం అత్యంత కీలకమైన అంశాలను ప్రస్తావించింది. ఫీడింగ్‌ ట్యూబ్‌ అనేది కేవలం ఆహారం మాత్రమే కాదని, అతి ఒక రకమైన వైద్య చికిత్స అని కోర్టు స్పష్టం చేసింది. దీన్ని ఆపడం అంటే ప్రకృతి సిద్ధంగా మరణానికి అనుమతించడమే తప్ప హత్య లేదా యాక్టివ్‌ యూతనేషియా కాదని వివరించించింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఉండే 30 రోజుల పునరాలోన సమయాన్ని కోర్టు ఈ కేసులో రద్దు చేసింది. హరీష్‌ను ఢిల్లీలోని AIIMS పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌లో చేర్చి, నిపుణుల సమక్షంలో గౌరవప్రదంగా లైఫ్ సపోర్ట్ తొలగించాలని ఆదేశించింది. 

హరీష్‌ రాణా తీర్పు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది భారత్ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం గౌరవంగా మరణించే హక్కును ఆచరణలోకి తెచ్చిన చారిత్రక ఘట్టం. లివింగ్ విల్ లేకపోయినా, వైద్య నిపుణుల నివేదికలు, కుటుంబ సభ్యుల సమ్మతి ఆధారంగా పాసివ్‌ యూతనేషియాకు అనుమతి ఇవ్వొవచ్చని ఈ కేసు నిరూపించింది.