తెలంగాణలో క్రమబద్ధీకరణ కోసం కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు సమర్పించిన పీహెచ్‌డీ డిగ్రీలు అసలా...నకిలీవా అన్న కోణంలో దర్యాప్తు చేసి ధ్రువీకరించాలని ఉన్నత విద్యాశాఖ సెంట్రల్ క్రైం స్టేషన్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. సుమారు రెండు నెలల క్రితం వివరాలన్నిటినీ పోలీసులకు అందజేసి విచారణ చేయాలని కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.


ఉద్యోగులు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్.. బిహార్‌లోని దర్భంగ... ఝార్ఖండ్‌లోని రామఘర్.. ఇలా పదికిపైగా రాష్ట్రాల్లోని 40కి పైగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీలు, పీజీలు చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో సమగ్రంగా దర్యాప్తుచేసి నివేదిక అందజేయాలని అక్టోబరులోనే కోరినా ఎన్నికల ప్రక్రియ కారణంగా అడుగు ముందుకు పడలేదని సమాచారం.


డిగ్రీ కాలేజీల్లోని సుమారు 800 మందికిపైగా కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం గత ఏడాది ఏప్రిల్‌లో సంబంధిత కాలేజీల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వాటికి ఈ ఏడాది జులైలో ఆర్థికశాఖ అనుమతితోపాటు మంత్రివర్గ ఆమోదం కూడా లభించింది. కాంట్రాక్టు లేదా పార్ట్‌టైం లెక్చరర్లను క్రమబద్ధీకరించాలంటే పీజీతో పాటు పీహెచ్‌డీ ఉండాలి. లేదా నెట్, సెట్ అర్హత సాధించాలి. దీంతో ఎక్కువమంది పీహెచ్‌డీలు పూర్తిచేసినట్లు ధ్రువపత్రాలు సమర్పించారు. ముందుగా కొందరిని క్రమబద్ధీకరించిన తర్వాత మరిన్ని ప్రతిపాదనలు వచ్చాయి.


పీహెచ్‌డీలన్నీ ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు వర్సిటీలవే కావడం, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, సిక్కిం, పాండిచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, హరియాణా, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని 40 విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీలు పొందిన వారే 140 మందికి పైగా ఉండటంతో అధికారులు కంగుతిన్నారు. అనుమానం వచ్చి తనిఖీ చేయించారు. సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులే వాటిని నిగ్గుతేల్చాల్సిందిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని సెంట్రల్ క్రైం స్టేషన్ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది.


ALSO READ:


తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ, సంసిద్ధత వ్యక్తం చేసిన 'టాటా' టెక్నాలజీస్
తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి 'టాటా' టెక్నాలజీస్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో సుమారు రూ.2 వేల కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధులు డిసెంబరు 30న సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎంతో చర్చించారు. రాష్ట్ర యువతకు ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం టాటా టెక్నాలజీస్ సంస్థ ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో నైపుణ్యశిక్షణ కార్యక్రమాలు అమలు చేసేందుకు టాటా టెక్నాలజీస్‌ అంగీకరించింది. దాదాపు లక్ష మంది విద్యార్థులు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేలా శిక్షణ అందించనుంది. టాటా సంస్థతో కలిసి ప్రభుత్వం పనిచేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెడతాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...