AP SSC Details Edit: ఏపీలోని పదోతరగతి విద్యార్థులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. విద్యార్థుల పేర్లు, ఇతరత్రా వివరాల్లో ఏమైనా తప్పులుంటే సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది. విద్యార్థులు డిసెంబ‌రు 16 నుంచి 20 వరకు వివరాలు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు.. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి డిసెంబరు 7న ఒక ప్రకటలో తెలిపారు. బోర్డుకు సమర్పించిన విద్యార్థుల దరఖాస్తుల్లో వివరాలు తప్పుగా ఉంటే సరి చేయాలని సూచించారు. విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, మాధ్యమం, ఫొటో, సంతకం, మొదటి, రెండో భాష సబ్జెక్టు వివరాలను పరిశీలించాలని ఆయన తెలిపారు. 


ఫీజు చెల్లింపు గడువు..
ఇప్పటికే పదోతగతి ఫీజు చెల్లింపు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే రూ.200 ఆలస్యరుసుముతో డిసెంబరు 9 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 10 నుంచి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆయన స్పష్టంచేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 31.08.2023 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి.


➥ రూ.200 ఆలస్యరుసుముతో నవంబరు 26 నుంచి నవంబరు 30 వరకు 


➥  రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 1 నుంచి డిసెంబరు 5 వరకు. 


ఫీజు చెల్లింపు వివరాలు..


➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే వారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.


➥ 3 సబ్జెక్టుల వరకు రాయాలనుకునే వారు రూ.110 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.


➥ 6 సబ్జెక్టులకు రాయాలనుకునే వారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.


➥ ప్రైవేటు విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం అదనంగా రూ.650 చెల్లించాల్సి ఉంటుంది.


➥ మూగు, చెవుడు, అంధ విద్యార్థులకు పరీక్ష ఫీజు, హాజరు మినహాయింపు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. 40 శాతం పైగా ప్రభావం ఉన్నవాళ్లను దివ్యాంగుల కేటగిరీ పరిగణిస్తారు.


➥ మూగ, చెవుడు విద్యార్థులకు రెండు భాషా సబ్జెక్టుల నుంచి మినహాయింపు ఉంది. అంధ అభ్యర్థులు స్క్రైబ్ తీసుకోవడానికి అర్హులు.


➥ లాంగ్వే్జ్ సబ్జెక్టుల నుంచి మినహాయింపు కోరే దివ్యాంగ విద్యార్థులు ముందుగా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.


'కాంపోజిట్‌' పేపర్ కొనసాగింపు..
ఈ ఏడాది కాంపోజిట్ తెలుగు, కాంపోజిట్ సంస్కృతం పేపర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. ఇదే విధానాన్ని ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్, ఉర్దూ/పార్శి పేపర్లకు అమలు చేయనుంది. మొదట కాంపోజిట్ పేపర్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యా సంవత్సరం మధ్యలో మార్పు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వచ్చే సంవత్సరం నుంచి తొలగించాలని నిర్ణయించింది. కాంపోజిట్ తెలుగు 70 మార్కులు, కాంపోజిట్ సంస్కృతం 30 మార్కులకు ఉంటుంది. 


ఏడు పేపర్లతోనే పరీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పబ్లిక్ పరీక్షలను గతేడాది ఆరు పేపర్లతో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక, రసాయనశాస్త్రాలు కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం 50 మార్కులకు మరో పేపర్‌గా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలను వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లు యథావిధిగా ఉంటాయి. 


ప్రశ్నపత్రాల్లో మార్పులు..


తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అవుతుండటంతో ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేశారు. 


➥ తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.


➥ రెండో ప్రశ్నగా ఇప్పటి వరకు పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా.. ఇప్పుడు గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున మార్కులు ఉంటాయి.


➥ హిందీలో విద్యార్థులు తేలికగా ఉత్తీర్ణులయ్యేలా ప్రశ్నపత్రాన్ని మార్చేశారు. గతంలో బిట్ పేపర్‌ను తొలగించగా.. ఇప్పుడు అదేవిధానాన్ని తీసుకొచ్చారు. 14 ఒక మార్కు ప్రశ్నలు, 19 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలే అధికం.


మోడల్ పేపర్లు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..