Changes in Degree curriculum: ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ పాఠ్యప్రణాళిలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. డిగ్రీ కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి రెండు మేజర్ సబ్జెక్టుల విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. 2023-24 విద్యా సంవత్సరం నుంచి సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని అమలుచేస్తుండగా.. అంతకుముందు మల్టీడిసిప్లీనరీ విధానంలో మూడు సబ్జెక్టుల విధానం ఉండేది. గత ప్రభుత్వం దాన్ని తొలగించి సింగిల్ మేజర్, మరో మైనర్ సబ్జెక్టుల విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో సింగిల్ మేజర్ కారణంగా చాలా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అన్ని సబ్జెక్టులను అందుబాటులో ఉంచలేని పరిస్థితి నెలకొంది.
డిగ్రీ కళాశాలల్లో మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులకు అందుబాటులో ఉంచితే.. లెక్చరర్ల సమస్య ఏర్పడింది. దీంతో కొన్ని సబ్జెక్టులను కొన్ని కళాశాలలకే పరిమితం చేశారు. దీనివల్ల అనేక ఇబ్బందులు వచ్చాయి. సింగిల్ మేజర్ సబ్జెక్టుపై విమర్శలు వచ్చాయి. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బీఎస్సీ కంప్యూటర్, బీకాం కంప్యూటర్ లాంటి కోర్సులనే అత్యధికంగా ప్రవేశపెట్టాయి. విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా కోర్సులను మార్పు చేసుకున్నాయి.
రెండు మేజర్ సబ్జెక్టుల విధానం ఇలా..
డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టుల విధానంతోపాటు ప్రాధాన్యత కలిగిన సబ్జెక్టులను మైనర్ సబ్జెక్టులుగా అమలు చేయాలని భావిస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ప్రకారం మూడేళ్ల డిగ్రీకి 120 క్రెడిట్లు అవసరమవుతాయి. నాలుగేళ్ల డిగ్రీకి 160 క్రెడిట్లు ఉండాలి. రాష్ట్రంలో 2020-21 నుంచి నాలుగేళ్ల డిగ్రీని అమలు చేస్తున్నా.. ఎక్కువ మంది విద్యార్థులు మూడేళ్ల డిగ్రీనే చదువుతున్నారు. యూజీసీ ప్రకారం మేజర్ సబ్జెక్టుకు 50% క్రెడిట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో మేజర్‌కు 40% క్రెడిట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, డాటా అనలిటిక్స్ లాంటి వాటిల్లో మైనర్ డిగ్రీని ప్రవేశ పెట్టడంపైనా కసరత్తు చేస్తున్నారు. ఇలా మూడు సబ్జెక్టుల విధానం వస్తే ఇది మల్టీడిసిప్లీనరీ అవుతుందని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కమిటీ ఏర్పాటు చేసిన ఉన్నత విద్యామండలి..
డిగ్రీ కరిక్యులమ్‌లో మార్పులకు ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణా యూనివర్సిటీ రిటైర్డ్ వీసీ వి.వెంకయ్య ఛైర్మన్‌గా 12 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యామండలి అకడమిక్ అధికారి శ్రీరంగం ఈ కమిటీకి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ట్రిపుల్‌ఐటీ బెంగళూరు మాజీ డైరెక్టర్ ఎస్ సదాగోపన్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ ఛాన్సలర్ అశ్వనీ కె.వోలేటిని నియమించారు. ఈ కమిటీ మూడు వారాల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు.
ఇంటర్ విద్యలోనూ మార్పులు..
ఏపీలోని ఇంటర్ విద్యావిధానంలో ఇంటర్మీడియట్ బోర్డు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచి సిలబస్, ప్రశ్నపత్రాల నమూనాలోనూ మార్పులు చేసింది. దీనిప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో మొదటిసారిగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పులకు సంబంధించి జూనియర్ కళాశాలలకు ఇంటర్ బోర్డు సమాచారం పంపింది. ప్రథమ సంవత్సరంలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను ప్రవేశపెట్టారు. పాఠశాల స్థాయిలో ఈ ఏడాది పదోతరగతిలో ఎన్‌సీఈఆర్టీ సిలబస్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీన్ని వచ్చే ఏడాదికి ఇంటర్మీడియట్ వరకు పొడిగించారు.