సాయుధ బలగాల్లో చేరాలంటే..
డిఫెన్స్ రంగంలో చేరాలని కొందరు యువతీ యువకులు ఆరాట పడుతుంటారు. ఏదో ఓ విభాగంలో పని చేసినా చాలు అనుకునే వాళ్లూ ఉంటారు. అలాంటి వారికి ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సెలెక్షన్ అథారిటీ అవకాశాలు కల్పిస్తోంది. డిఫెన్స్‌లో చేరాలనుకునే వారికి పలు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహించి స్వాగతిస్తోంది. ఇంటర్మీడియట్ అర్హతతో ఇందులో ఉద్యోగాలు సాధించవచ్చు. ఇంటర్ పాస్ అయిన వాళ్లు
డిఫెన్స్‌లో ఏ కోర్స్ చేయటానికైనా కనీస అర్హత సాధించినట్టే లెక్క. సైన్స్, కామర్స్, ఆర్ట్స్ గ్రూప్‌లో ఇంటర్మీడియట్ చేసిన వారికి జూనియర్ ఆఫీసర్, సోల్జర్, ఎయిర్‌మెన్ లాంటి ఉద్యోగాల్లో చేరవచ్చు. ఇంటర్ అర్హతతో చేసే కోర్సుల్లో ఎన్‌డీఏ ఎంట్రీ, ఎమ్‌ఎన్‌ఎస్ ఎంట్రీ, టీఈఎస్ ఎంట్రీ లాంటివి ఉన్నాయి.
ఎన్‌డీఏ, ఎమ్‌ఎన్ఎస్, టీఈఎస్..
ఎన్‌డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇందులో సెలెక్ట్ అవ్వాలంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తరవాత ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితర పరీక్షలుంటాయి. త్రివిధ దళాల్లోనూ ఈ విధంగానే ఎంపిక చేసుకుంటారు. ఈ కోర్స్‌కి ఎంపికైన వారికి మూడేళ్ల పాటు శిక్షణనిస్తారు. ఎన్‌డీఏలో శిక్షణ పూర్తయ్యాక నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. 16.5 నుంచి 19 మధ్య వయసున్న వాళ్లు ఈ ఎన్‌డీఏ కోర్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్‌గా, మెడికల్‌గా ఫిట్‌గా ఉంటేనే అర్హత సాధిస్తారు.
కేవలం అమ్మాయిల కోసమే డిఫెన్స్‌లో ప్రవేశపెట్టిన కోర్స్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్- MNS.సాధారణ నర్స్‌లతో పోల్చితే వీరి విధుల్లో పెద్దగా
మార్పులు లేకపోయినా, శిక్షణలో మాత్రం మార్పులుంటాయి. యుద్ధాలు జరిగే సమయంలో గాయపడ్డ సైనికులకు ఏ విధంగా చికిత్స అందించాలో వీరికి తర్ఫీదునిస్తారు. ఎమ్‌ఎన్‌ఎస్‌గా సెలెక్ట్ అవ్వటానికి ముందుగా రిటెన్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. తరవాత ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఇంటర్ లేదా 12వ తరగతి పాస్ అయిన వారెవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా బయాలజీ తప్పనిసరి సబ్జెక్ట్‌లుగా ఉండాలి. 17-25 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలు ఈ కోర్స్‌లో చేరేందుకు అర్హులు. 152 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తున్న వాళ్లను తీసుకోరు.
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-TESలో చేర్చుకునే ముందు 12వ తరగతి లేదా ఇంటర్‌లో ఎన్ని మార్క్‌లు వచ్చాయో చెక్ చేస్తారు. ఆ మార్క్‌ల ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ మొదలు పెడతారు. ఇంటర్వ్యూ చేసి ఆ తరవాత మెడికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీలోని టెక్నికల్ విభాగంలో అవసరాల మేరకు శిక్షణ అందిస్తారు. ఆఫీసర్ లేదా ఇంజనీర్‌గా నియమిస్తారు. పెళ్లి కాని వాళ్లు, 16.5 నుంచి 19.5 మధ్య వయసున్న వాళ్లు మాత్రమే ఈ కోర్స్ చేసేందుకు అర్హులు.
ఇండియన్ నేవీ బీటెక్ ఎంట్రీ కోర్స్‌కు జేఈఈ మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇండియన్ నేవీలో పని చేయాలనుకునే వాళ్లు ఈ కోర్స్‌లో జాయిన్ అవచ్చు. సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తుంది. 16.5-19.5 మధ్య వయసున్న వాళ్లు దీనికి అర్హులు. ఈ కోర్స్‌లో ఎవరికీ ఏ రిలాక్సేషన్లు ఇవ్వలేదు.