దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్-జూన్ 2022' దరఖాస్తు గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. జులై 11 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎవరు అర్హులు..?
★ సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ/ తత్సమాన డిగ్రీ ఉండాలి. (లేదా) ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
★ 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి ఎంత..?
★ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్ఎఫ్) కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01.07.2021 నాటికి 28 సంవత్సరాలకు మించకూడదు. వయోపరిమితిలో ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది.
★ లెక్చరర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1000; ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
పరీక్ష విధానం ఎలా ఉంటుంది..?
మొత్తం 5 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.
★ పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి.
- 'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- 'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.07.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.08.2022.
పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.