SC, ST Reserations: ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజ్యాంగపరంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలుచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నడిపించుకోవడం సరైంది కాదన్నారు. విద్యారంగంపై డిసెంబరు 30న ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చర్చించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై సమగ్ర నిబంధనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిబందనలు పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. 


ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగంపరంగా ఉన్న హక్కు అని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ వాటిని అమలుచేయాల్సిందే అని ఉద్ఘాటించారు. అవసరమైతే శాసనసభలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు వర్సిటీలకు ఇచ్చిన అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, బోధన రుసుములు, బోధన, బోధనేతర సిబ్బంది, వారి విద్యార్హతలు వంటి వాటన్నింటిపైనా నివేదిక ఇవ్వాలి. వాటిలో ఉన్న మౌలిక వసతులు, అవసరమైన మేరకు ప్రమాణాలు ఉన్నాయో లేదో కూడా పరిశీలించి నివేదికలో పొందుపరచాలి అని సీఎం అధికారులను ఆదేశించారు. 


మరోవైపు.. ఇళ్ల ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్ అయిన భూములుగా ధరణిలో ఉన్నప్పటికీ.. వాటిలో కొన్ని ప్రైవేటు వర్సిటీలు నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చారని సీఎం అన్నారు. వీటన్నింటిపైనా సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఓ వర్సిటీ నిర్వాకంతో గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 


ఉపకారవేతన దరఖాస్తు గడువు పొడిగింపు..
తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీజుల రెన్యువల్, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. డిసెంబరు 31తో ముగియాల్సిన గడువును నెలపాటు ప్రభుత్వం పొడిగించింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులైన విద్యార్థులు జనవరి 31లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం (డిసెంబరు 30) ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 19న ప్రారంభమైంది. ఈ గడువు ఆదివారంతో ముగియనుంది. ఈపాస్ గణాంకాల ప్రకారం రెన్యువల్ విద్యార్థులు 8,04,304 మంది ఉంటే ఇప్పటివరకు కేవలం 5.08 లక్షల మంది మాత్రమే అర్జీలు సమర్పించారు. కొత్తగా ప్రవేశాలు పొందిన వారు దాదాపు 5 లక్షల మంది ఉంటే.. 1.82 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది.


రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం..
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ వెంకటరమణను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల వారిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొత్తవారిని ఎంపికచేసే వరకు వీరినే కొనసాగించాలని మౌఖిక ఆదేశాలు  జారీచేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించే వరకూ వీరిద్దరు వారివారి పదవుల్లో కొనసాగనున్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...