CBSE 10th Rules: వచ్చే ఏడాది సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శుభవార్త చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి ఉత్తీర్ణత ప్రమాణాలలో ఎలాంటి మార్పులు ఉండబోవని బోర్డు స్పష్టం చేసింది.
ఉత్తీర్ణత విధానం
ఒక సబ్జెక్టులో పాస్ కావాలంటే విద్యార్థులు బోర్డు ఎగ్జామ్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ రెండింటిలో కలిపి మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. అంటే, 80 మార్కుల బోర్డు పరీక్షలోనూ, 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లోనూ విడివిడిగా 33 శాతం మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిలోనూ మార్కులను కలిపి తుది ఫలితాన్ని నిర్ణయిస్తారు. అయితే, విద్యార్థి తప్పనిసరిగా బోర్డు ఎగ్జామ్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ రెండింటికీ హాజరై ఉండాలి.
గందరగోళానికి తెర
ఇటీవల 2026-27 పాఠ్యప్రణాళికకు సంబంధించి వచ్చిన కొన్ని మార్పుల వల్ల బోర్డు పరీక్షలు, ఇంటర్నెల్ అసెస్మెంట్ విడివిడిగా 33 శాతం మార్కులు సాధించాలనే ప్రచారం జరిగింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. దీనిపై హర్యానాలోని సోనిపట్ స్కూల్ ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు సీబీఎస్ఈ వెబినార్ ద్వారా స్పష్టతనిచ్చింది. గతంలో ప్రత్యేక నిబంధనలపై చర్చ జరిగినా, ప్రస్తుతానికి దానిని ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. 2025-26 విద్యా సంవత్సరంలో అమలైన పాత నిబంధనలే 2026-27కి కూడా వర్తిస్తాయని తేల్చిచెప్పింది. Also Read: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
12వ తరగతి నిబంధనలు వేరు
10వ తరగతి విషయానికి వస్తే ఇలా ఉంటే, 12వ తరగతి విద్యార్థులకు మాత్రం ప్రాక్టికల్, థియరీ వేర్వేరుగా ఉత్తీర్ణత ప్రమాణాలు ఉన్నాయని సీబీఎస్ఈ బోర్డు గుర్తుచేసింది.
పరీక్షా విధానంలోనూ ఎలాంటి మార్పులు లేవు
ఉత్తీర్ణత ప్రమాణాలతో పాటు, 2026-27 విద్యా సంవత్సరానికి ఎగ్జామ్ పేపర్ రూపొందించడం, సిలబస్, కరెక్షన్ విధానంలోనూ ఎటువంటి మార్పులు లేవని సీబీఎస్ఈ పేర్కొంది.
10, 12వ తరగతుల విద్యార్థుల కోసం బోర్డు ఇప్పటికే శాంపిల్ ఎగ్జామ్ పేపర్స్ , మార్కింగ్ స్కీమ్‌లను సిద్ధం చేసింది. ప్రశ్నపత్రాల సరళి, మార్కుల వెయిటేజీని అర్థం చేసుకోవడానికి విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు.
Also Read: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
