తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో బీకామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఏకంగా 'బీటెక్'ను బీట్ చేసి 'బీకామ్' పైచేయి సాధించింది. బీటెక్‌లో చేరిన విద్యార్థుల కంటే బీకాంలో ప్రవేశాలు పొందినవారి సంఖ్యే అధికంగా ఉండటం ఇదే తొలిసారి అని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో గతానికి మించి రికార్డు స్థాయిలో కన్వీనర్ కోటాలో 62వేల మంది, యాజమాన్య కోటాలో సుమారు 20 వేల మంది, ప్రైవేట్ వర్సిటీల్లో మరో 10వేల వరకు.. మొత్తంగా 92 వేల మంది ప్రవేశాలు పొందారు. అదే సమయంలో ఈ విద్యా సంవత్సరం డిగ్రీలో మొత్తం 2,10,970 మంది చేరగా.. వారిలో 87,480 మంది అంటే 41.47 శాతం బీకాం విద్యార్థులే ఉండటం విశేషం.
మొత్తం విద్యార్థుల్లో 1,09,480 మంది(52.06 శాతం) మంది అమ్మాయిలే. బీఎస్‌సీ లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్(బీఎస్‌డబ్ల్యూ) కోర్సుల్లో అమ్మాయిలు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా బీఎస్‌సీ లైఫ్ సైన్స్‌లో 75శాతం వారే ఉండటం గమనార్హం. ఈసారి బీటెక్‌లో 80వేల మంది ప్రవేశాలు పొందగా.. డిగ్రీలో 2.10 లక్షల మంది చేరారు. అంటే ఇంజినీరింగ్ కంటే రెండున్నర రెట్లకు పైగా డిగ్రీ విద్యార్థులున్నారు.
అందుకే డిమాండ్ - ప్రొఫెసర్ లింబాద్రి
దోస్త్ ద్వారా బీకాంలో 87,480 మంది చేరగా.. దానితో సంబంధం లేకుండా సొంతగా ప్రవేశాలు పూర్తి చేసుకున్న కళాశాలలు మరో 40 వరకు ఉన్నాయి. వాటిలో 15వేల మంది ప్రవేశాలు పొందారని, అత్యధికంగా బీకాం, బీఎస్‌సీ కోర్సుల్లో చేరారని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. వారిలో కనీసం ఆరేడు వేల మంది బీకాం విద్యార్థులు ఉంటారని, రాష్ట్రంలో బీకాం ప్రవేశాల సంఖ్య 93,480 మందికి తగ్గదని అంచనా వేస్తున్నామన్నారు. దీన్నిబట్టి తొలిసారిగా బీటెక్‌ను మించి రాష్ట్రంలో బీకాం ప్రవేశాలు ఉన్నట్లు స్పష్టమవుతోందని లింబాద్రి చెప్పారు. కామర్స్‌లో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని, దానికితోడు కంప్యూటర్ సబ్జెక్టును జోడించడం, కొత్తగా బీకాం బిజినెస్ ఎనలిటిక్స్ కోర్సును ప్రవేశపెట్టడం వంటి కారణాల వల్ల ఆ కోర్సులో చేరికలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
బీకామ్ ప్రవేశాలు ఇలా..
Also Read:
ఇంజినీరింగ్ ప్రవేశాలు ఈసారి భారీగానే, కారణమిదే!
తెలంగాణలో ఈసారి ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్క కన్వీనర్ కోటా విభాగంలోనే ఈ ఏడాది 7 వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంసెట్ కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా కింద 82 వేలకుపైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
గత విద్యాసంవత్సరం వరకు కన్వీనర్ కోటా కింద 55 వేల లోపే సీట్లు భర్తీ అయ్యేవి. వీటిలో 3, 4 వేల స్పాట్ ప్రవేశాలు ఉండేవి. కాని ఈ ఏడాది కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న 79,346 సీట్లలో 62,100 (78.26 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. వాటిలో దాదాపు 4 వేల మంది స్పాట్ ప్రవేశాల్లో సీట్లు పొందారు. ఇక మేనేజ్‌మెంట్ కోటా కింద ఏటా 14 వేల నుంచి 18 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందేవారు. అయితే ఈ సంవత్సరం 20 వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందే అవకాశముంది.
ప్రవేశాల పెరుగుదలకు కారణమిదే..!
ఈ ఏడాది బీటెక్‌లో ప్రవేశాలకు ప్రధాన కారణం కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ (ఏఐ అండ్ ఎంఎల్), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి పలు కొత్త బ్రాంచ్‌లను ప్రవేశ పెట్టడమే. ఇప్పటివరకు డిమాండ్ లేని బ్రాంచ్‌ల స్థానంలో 9 వేలకుపైగా కొత్త బ్రాంచీల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచ్‌లో చదివినా తిరిగి ఐటీ వైపుకే మళ్లాల్సి వస్తోంది. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు దక్కినా జీతాలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో సీఎస్ఈ, దానికి అనుబంధ బ్రాంచ్‌లలో చేరేవారి సంఖ్య ఈసారి విపరీతంగా పెరిగింది.