తెలంగాణలోని నిర్మల్‌ జిల్లాలో ఉన్న బాసర ఆర్జీయూకేటీలో (రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు బాస‌ర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియను పదో తరగతిలో సాధించిన ఫలితాల (జీపీఏ) ఆధారంగా నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది మాత్రం పాలిసెట్‌ పరీక్షలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. 


దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. గడువు ఆగస్టు 12తో ముగియనుందని అధికారులు వెల్లడించారు. దివ్యాంగ అభ్యర్థులు ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ విధానాల్లో ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్‌ విధానంలో https://www.admissions.rgukt.ac.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 


ఆగస్టు 18న జాబితా..
ఎంపికైన వారి జాబితాను ఆగస్టు 18వ తేదీన విడుదల చేస్తారు. నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 6304893876 నంబర్ లేదా dmissions@rgukt.ac.in మెయిల్‌ను సంప్రదించవచ్చు. బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల అయినా.. సీట్ల సంఖ్య మాత్రం తెలియరాలేదు. గతేడాది 1500 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించగా.. ఈసారి ఆ సంఖ్యను కుదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
85 శాతం స్థానికులకు.. 
తెలంగాణ పాలిసెట్ 2021 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారు.. దీనికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాల వారు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2021 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్ల వయసు ఉన్న వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్ల వరకు వయో పరిమితి ఉంది.


సీట్ల కేటాయింపులో స్థానిక కోటాలో తెలంగాణ విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్ ఉండనుంది. 15 శాతం సీట్లను మిగతా వారికి కేటాయిస్తారు. టీఎస్ పాలిసెట్ 2021 పరీక్షలో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మెరిట్ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. 


ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం..
పీహెచ్/ సీఏపీ/ ఎన్‌సీసీ/ స్పోర్టు కోటాలో దరఖాస్తు చేసుకునే వారు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ విధానాల్లో చేసుకోవాల్సి ఉంటుంది. మొదట ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫామ్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీయాలి. దరఖాస్తు ఫామ్ హార్డ్ కాపీలను, నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర డాక్యుమెంట్లతో కలిపి పోస్టు చేయాలి. 
దరఖాస్తులను పంపాల్సిన చిరునామా: 
ద కన్వీనర్, 
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, 
బాసర, నిర్మల్ జిల్లా, తెలంగాణ -504107