ఏపీలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 2,12,221 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సప్లిమెంటరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత ఏప్రిల్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ పేరు, జిల్లాపేరు, స్కూల్ వివరాలు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. జవాబు పత్రాల ముల్యాంకనం జూన్ 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. జూన్ చివరివారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
పదోతరగతి హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు సూచనలు..
➥ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
➥ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
➥ క్వశ్చన్ పేపర్‌ను చదువుకోవడానికి 15 నిమిషాల సమయం ఉంటుంది.
➥ పరీక్షలో కాపీయింగ్ చేయడం, చీటింగ్ వంటి పనులు చేయడం విరుద్ధం, పట్టుబడితే డీబార్ చేస్తారు.
➥ దివ్యాంగులకు పరీక్షలు రాయడానికి అరగంట సమయం అదనంగా ఉంటుంది.
➥ పరీక్ష సమయం ముగిసే వరకు విద్యార్థులను బయటకు పంపరు, కాబట్టి.. విద్యార్థులు తమ జవాబు పత్రాలను క్షుణ్నంగా పరిశీలించుకోవాలి
పరీక్షల షెడ్యూలు ఇలా..
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
➥ జూన్ 2న: తెలుగు పరీక్ష
➥ జూన్ 3న: హిందీ పరీక్ష
➥ జూన్ 5న: ఇంగ్లిష్ పరీక్ష
➥ జూన్ 6న: గణితం పరీక్ష
➥ జూన్ 7న: సైన్స్ (ఫిజికల్ సైన్స్, బయాలజీ) పరీక్ష
➥ జూన్ 8న: సోషల్ స్టడీస్ పరీక్ష
➥ జూన్ 9న: కాంపోజిట్ విద్యార్థులకు పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-1 పరీక్ష
➥ జూన్ 10న: ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్ష.
ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 6న ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 6,64,152 మంది హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన తర్వాత ఏప్రిల్ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం నిర్వహించారు. అనంతరం ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది కంటే 5 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పాస్ పర్సంటేజ్ పెరిగింది. అది 3.47 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూసుకుంటే ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉంది. ఆ జిల్లాలో పాస్ పర్సంటేజ్ 87.4 శాతం ఉంది. అతి తక్కువ ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా వెనుకబడింది. అక్కడ పాస్ పర్సంటేజ్ 60.39శాతం. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 95.25 శాతం మంది విద్యార్థులు పదో తరగతిలో పాస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 938 స్కూల్స్ నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. 38 స్కూల్స్‌లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. గతంలో పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌కు రెండేసి పేపర్లు ఉండేవి ఈసారి మాత్రం ఒక పేపర్ విధానం తీసుకొచ్చారు. ఈ పరీక్షలకు 6,09,081 మంది రెగ్యులర్ విద్యార్థులు అప్లై చేసుకోగా... అందులో6,05,052 మంది మాత్రమే పరీక్షలు రాశారు. పరీక్షకు హాజరైన వారిలో 3,09,245 మంది బాయ్స్ ఉంటే... 2,95,807 మంది బాలికలు ఉన్నారు.
Also Read:
తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వెలువడింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. కాంపొజిట్ పేపర్లకు మాత్రం మధ్యాహ్నం 12.50 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..