AP Academic Calendar 2022 :  ఏపీలో బడి గంట మోగేందుకు ముహూర్తం ఖరారు అయింది. జులై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఏడాది జూన్‌ 12న పాఠశాలలు తెరిచేవారు. కానీ ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభ తేదీలో మార్పులు జరిగాయి. గతంతో పోలీస్తే ఈ ఏడాది ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. జులై 5 నుంచి స్కూల్స్ తెరిచేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ విద్యాసంవత్సరం జులై 5 ప్రారంభమై ఏడాది ఏప్రిల్‌ 29వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రకటించారు. జులై 4వ తేదీన పాఠశాలలు తెరవాలని భావించారు. కానీ జులై 4 ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండడంతో ఒక రోజు ఆలస్యంగా పాఠశాలలు పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 220 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. 80 రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.


అకడమిక్ కేలండర్ విడుదల 


ఏపీ అకడమిక్ కేలండర్ ను రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(SCERT) ఇవాళ ప్రకటించింది. ఈ ఏడాది 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజుల సెలవులు ఉంటాయని ప్రకటించింది. 1 నుంచి 9 తరగతులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 27తో ముగుస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది విద్యార్థులకు సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ప్రకటించింది.


టీచర్లకు ఈ నెల 28 నుంచే 


 ఈ ఏడాది పరీక్షలకు సంబంధించి తాత్కాలిక షెడ్యూలును ఎస్సీఈఆర్టీ ప్రకటించింది. సెప్టెంబరులో ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-1 పరీక్షలు, అక్టోబర్ లో ఫార్మేటివ్‌-2 పరీక్షలు, నవంబర్, డిసెంబరులో సమ్మేటివ్‌-1, వచ్చే ఏడాది జనవరిలో ఫార్మేటివ్‌-3 పరీక్షలు, ఫిబ్రవరిలో ఫార్మేటివ్‌-4 పరీక్షలు, పదో తరగతి ప్రీ ఫైనల్‌ ఫిబ్రవరి 22 నుంచి ఉంటాయని తెలిపింది. సమ్మేటివ్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. జీవో 117లో పాఠశాలలను 6 రకాలుగా వర్గీకరించింది. పాఠశాలలు జులై 5వ తేదీని ప్రారంభమవుతున్నా టీచర్లు మాత్రం ఈ నెల 28వ తేదీ నుంచి స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. పాఠశాలల ప్రారంభం నాటికి ప్రాంగణాన్ని శుభ్రం చేయించడం, తరగతి గదులను అలంకరించడం లాంటివి చేయాలని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. పాత పుస్తకాలను సేకరించి బుక్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని తెలిపింది. 29న తల్లిదండ్రుల కమిటీలు, ఇతర ప్రభుత్వ విభాగాలతో మీటింగ్ నిర్వహించాలని తెలిపింది. విద్యా కానుకల కిట్లను జులై 5న పంపిణీ చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.