ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3తో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు,  ఏప్రిల్ 4తో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది.


మాచవరంలోని ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుందని ఉమ్మడి కృష్ణా జిల్లా ఆర్‌ఐవో పి.రవికుమార్ తెలిపారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గణితం, సివిక్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందన్నారు.


ఇంటర్ విద్యామండలి నుంచి ఉత్తర్వులు అందుకున్న అధ్యాపకులు విధిగా హాజరవ్వాలని రవికుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రైవేటు యాజమాన్యాలు.. తమ అధ్యాపకులు విధులకు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అధ్యాపకులను పంపని కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.


ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!


రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మార్చి 27న సెకండియర్ ఫిజిక్స్ పరీక్ష నిర్వహించారు. దీనిలో ఇంగ్లిష్ మీడియం పేపర్లో తప్పులు దొర్లినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలపుతామని బోర్డు ప్రకటించింది. ఫిజిక్స్ పేపర్ 2లోని మూడో ప్రశ్న తప్పుగా ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది.


తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో మూడో ప్రశ్నగా ఆయస్కాంత ప్రవణత(అవపాతము)ను నిర్వచించుము? అని రాగా, ఆంగ్ల మాధ్యమ ప్రశ్నపత్రంలో డిఫైన్ మ్యాగ్నటిక్ డెక్లినేషన్ అని తప్పుగా ప్రచురితమైంది. దానికి బదులుగా డిఫైన్ మ్యాగ్నటిక్ ఇన్‌క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అని రావాల్సి ఉంది. దీనికి పరీక్ష కేంద్రాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి సందేశాలు పంపించారు.


కొన్నిచోట్ల ఆ విషయం విద్యార్థులకు చెప్పగా, మరికొన్నిచోట్ల ఆ విషయం వారికి చేరలేదు. నంద్యాల జిల్లా డోన్ పట్టణ సమీపంలోని ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు నిర్వాహకులు ఈ విషయం చెప్పకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తప్పుగా వచ్చిన ప్రశ్నకే తాము సమాధానం రాశామని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రశ్న తప్పుగా రావడాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంటర్మీడియట్ రెండో ఏడాది భౌతికశాస్త్రం పరీక్షలో ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు రెండు మార్కులను కలపనున్నారు. ప్రశ్నపత్రంలోని మూడో ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా 2 మార్కులు ఇవ్వాలని ఇంటర్ విద్యామండలి నిర్ణయించింది.


Also Read:


సైనిక పాఠశాలలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశ ప్రకటన విడుదల-పరీక్ష ఎప్పుడంటే?
ఎన్‌డీఏ, ఎస్‌ఎస్‌బీ తదితర సైనిక దళాల్లో అధికారుల నియామకాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ సైనిక పాఠశాలను బాలుర కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. పాఠశాలలో సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)... 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వరంగల్ జిల్లా అశోక్ నగర్‌లో బాలుర సైనిక స్కూల్ ఆరో తరగతి (సీబీఎస్‌ఈ సిలబస్), ఇంటర్మీడియట్(ఎంపీసీ- సీబీఎస్ఈ సిలబస్)లో ప్రవేశాలకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..