AP Inter 1st Year Results 2026 | అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించారు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్నేళ్లతో పోల్చితే పెరిగింది. మొత్తం 10, 57, 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5, 31, 275 మంది ఉన్నారు. జనరల్ విభాగంలో, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు ఇద్దరూ ఉన్నారు.
నేరుగా మీ వాట్సాప్‌లో ఫలితాలుమీ ఫోన్‌లో 9552300009 నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని మెస్సేజ్ చేసి రిజల్ట్స్ చేక్ చేసుకోవచ్చు. Hi అని మెస్సేజ్ తరువాత వచ్చే సూచనలు పాటిస్తూ మీ హాల్‌టికెట్ నెంబర్, వివరాలు ఎంటర్ చేస్తే సెకన్‌లలో ఫలితాలు మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఏపీ ఇంటర్ ఫస్టియర్ లో 510307 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జనరల్ విభాగంలో 361526 మంది, వొకేషనల్ విభాగంలో 23569 మంది పాసయ్యారు. ఫస్టియర్‌లో జనరల్ విభాగంలో బాలికలు 81 శాతం, బాలురు 72 శాతం పాసయ్యారు. వొకేషనల్ విభాగంలో బాలికలు 71 శాతం, బాలురు 49 శాతం పాసయ్యారు.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు - జిల్లా వారీగా
| జిల్లా | హాజరు | పాసైన వారు | పాస్ శాతం (%) | |
| 1 | కృష్ణా | 22,403 | 20,142 | 90 |
| 2 | గుంటూరు | 33,643 | 29,530 | 88 |
| 3 | విశాఖపట్నం | 37,891 | 32,334 | 85 |
| 4 | ఎన్టీఆర్ | 34,510 | 29,103 | 84 |
| 5 | పార్వతీపురం మన్యం | 5,713 | 4,759 | 83 |
| 6 | తూర్పు గోదావరి | 19,977 | 16,439 | 82 |
| 7 | ఎస్పీఎస్ఆర్ నెల్లూరు | 25,147 | 19,682 | 78 |
| 8 | తిరుపతి | 28,383 | 22,016 | 78 |
| 9 | అల్లూరి సీతారామరాజు | 5,653 | 4,368 | 77 |
| 10 | పశ్చిమ గోదావరి | 16,701 | 12,775 | 76 |
| 11 | ఏలూరు | 14,621 | 11,133 | 76 |
| 12 | అనకాపల్లి | 10,315 | 7,602 | 74 |
| 13 | పల్నాడు | 15,945 | 11,622 | 73 |
| 14 | కర్నూలు | 22,474 | 16,356 | 73 |
| 15 | అనంతపురము | 21,730 | 15,814 | 73 |
| 16 | విజయనగరం | 16,984 | 12,268 | 72 |
| 17 | బాపట్ల | 8,831 | 6,361 | 72 |
| 18 | డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ | 10,527 | 7,580 | 72 |
| 19 | ప్రకాశం | 19,254 | 13,520 | 70 |
| 20 | శ్రీ సత్యసాయి | 9,959 | 6,969 | 70 |
| 21 | శ్రీకాకుళం | 17,432 | 12,163 | 70 |
| 22 | చిత్తూరు | 12,567 | 8,691 | 69 |
| 23 | కాకినాడ | 19,434 | 13,156 | 68 |
| 24 | వైఎస్ఆర్ కడప | 15,286 | 10,150 | 66 |
| 25 | నంద్యాల | 13,598 | 9,024 | 66 |
| 26 | అన్నమయ్య | 12,886 | 7,969 | 62 |
| మొత్తం | TOTAL | 4,71,864 | 3,61,526 | 77 |
అత్యధిక ఉత్తీర్ణత సాధించిన టాప్ 5 జిల్లాలు
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 90 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు (88 శాతం), విశాఖపట్నం (85 శాతం) జిల్లాలు నిలిచాయి. ఎన్టీఆర్ జిల్లా 84 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, పార్వతీపురం మన్యం జిల్లా 83 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది.
అల్ప ఉత్తీర్ణత నమోదైన చివరి 5 జిల్లాలు
అన్నమయ్య జిల్లా 62 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలు చెరో 66 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచాయి. కాకినాడ జిల్లాలో 68 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, చిత్తూరు జిల్లా 69 శాతంతో చివరి నుండి ఐదో స్థానంలో ఉంది. ఈ జిల్లాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత అయిన 77 శాతం కంటే తక్కువ ఫలితాలు సాధించాయి.
